HMDA Layouts e-Auction 2022 :హెచ్‌ఎండీఏ పరిధిలోని లేఅవుట్లలో ప్లాట్ల వేలానికి అనూహ్య స్పందన వస్తోంది. చదరపు గజానికి హెచ్‌ఎండీఏ నిర్ణయించిన కనీస ధర కంటే తొలిరోజు రెండింతలు ధర పలకడం విశేషం. మరో రెండు రోజులపాటు వేలానికి అవకాశం ఉండటంతో మరింత ధర పలుకుతుందని భావిస్తున్నారు. వేలం ప్రక్రియ ద్వారా ఒక్కరోజే దాదాపు రూ.120 కోట్ల లావాదేవీలు జరిగాయని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
దుండిగల్ మున్సిపాలిటీలోని బహదూర్‌పల్లిలో 40 ఎకరాల్లో 101 ప్లాట్లు, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరులో 117 ఎకరాల్లో 223 ప్లాట్లకు హెచ్‌ఎండీఏ సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించింది. ఈ నెల 17 తేదీ వరకు ప్రక్రియ కొనసాగనుంది. బహదూర్‌పల్లిలో ప్లాట్లను చదరపు గజానికి రూ.25 వేలు, తొర్రూర్‌లో చదరపు గజానికి రూ.20 వేలు వంతున కనీస ధర నిర్ణయించారు. బహదూర్‌పల్లిలో రూ.48 వేలకు, తొర్రూరులో రూ.37 వేలకు కోట్ చేశారు. మరో రెండు రోజులు మిగిలి ఉండడంతో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ రెండు లేఅవుట్లతోపాటు నాగోలు వద్ద రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలానికి పెట్టారు. 15 క్లస్టర్లలో 2500 వరకు ఫ్లాట్లు ఉన్నాయి. క్లస్టర్ల వారీగా వేయనున్న ఇ-వేలంను ఈ నెల 24న ప్రారంభించనున్నారు.