ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని కఠారిపాలెం, వాడరేవు మత్స్యకారుల మధ్య సముద్రంలో చేపలు పట్టే విషయంపై కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. చేపల వేటకు వాడరేవు జాలర్లు బల్ల వల వినియోగిస్తున్నారని...దీని వల్ల మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతోందని కఠారివారిపాలెం జాలర్లు వాడరేవుకు సంబంధించిన బోట్లు, వలలను కొద్దిరోజుల కిందట దౌర్జన్యంగా తీసుకెళ్లారు.
ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు శుక్రవారం మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖరరెడ్డి, చీరాల రూరల్ సీఐ, వేటపాలెం, ఈపురుపాలెం ఎస్సైలు ..సిబ్బందితో కలిసి కఠారివారిపాలెంలో ఇరు గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వాడరేవు జాలర్లు రాలేదు. అధికారులు వాడరేవు వాళ్లు ఎందుకు రాలేదని అడగ్గా...కటారివారిపాలెం మత్స్యకారులు వాడరేవు వాళ్లను తీసుకొస్తామని వెళ్లారు. పోలీసులు చెప్పినా వినకుండా సముద్రంలోకి వెళ్లి వాడరేవుకు చెందిన సుమారు 10 మందిని తీసుకొచ్చి వారి ఆధీనంలో ఉంచుకున్నారు. అధికారులు వారిని విడిచిపెట్టాలని చెప్పినా వినిపించుకోలేదు.
ఈ విషయం తెలిసి వాడరేవు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి కటారివారిపాలెంకు చెందిన 10 మందిని ఓడరేవుకు తీసుకొచ్చి వారి ఆధీనంలో ఉంచుకున్నారు. ఆగ్రహంతో కటారిపాలెం, రామాపురం మత్స్యకారులు...వాడరేవు తీరానికి వెళ్లారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వివాదం ముదిరి ...కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. పలు ద్విచక్ర వాహనాలు , ఒక కారు, ధ్వంసమయ్యాయి. 8 మందికి తీవ్ర గాయాలు...14 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు మత్స్యకారులను చెదరగొట్టి ...క్షతగాత్రులను చీరాల వైద్య శాలకు తరలించారు.
కఠారివారిపాలెం జాలర్ల దాడిలో తమ ఆస్తులు ధ్వంసమయ్యాయని వాడరేవు వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వివాదం మరింత ముదరకుండా....వాడరేవు, కఠారివారిపాలెం, రామాపురంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.
ఇదీ చదవండి: బంజారాహిల్స్‌లో స్టెరాయిడ్స్.. ఇద్దరు అరెస్టు