Registration: ఆంధ్రప్రదేశ్‌లో వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) అమర్చుకోవడం తప్పనిసరి చేయడంపై.. రవాణాశాఖ దృష్టి సారించింది. మూడు నెలల్లో వీటిని బిగించుకోకపోతే, ఆ తర్వాత రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించనుంది. ఇప్పటివరకు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండగా, ఇకపై కచ్చితంగా నిబంధనలు అమలు చేయాలంటూ రవాణాశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తాజాగా ఆదేశాలిచ్చారు. దీంతో 2015 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ అయిన అన్ని వాహనాల యజమానులకు రవాణాశాఖ అధికారుల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి.
వాహనానికి హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేకపోతే, ఆ మెసేజ్‌లో ఉండే లింక్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందులో రూ.400 ఫీజు డిజిటల్ విధానంలో చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ప్లేట్ ఏ రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి అమర్చుకుంటారో ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత నాలుగైదు రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్లేట్ సంబంధిత రవాణాశాఖ కార్యాలయంలో సిద్ధంగా ఉంటుంది. వాహనదారుడు వెళ్లి, అక్కడే వాహనానికి అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. మూడు నెలల వరకు వాహనదారులందరికీ మెసేజ్‌లు పంపుతామని, తర్వాత తనిఖీలు చేపట్టి జరిమానాలు వేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఫీజు చెల్లించినా ప్లేట్‌పై నిరాసక్తి.. హెచ్‌ఎస్‌ఆర్‌పీలను కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) 2009 నుంచి అమలుచేయగా, ఏపీలో వీటిపై 2013 చివర్లో ఆదేశాలిచ్చారు. 2015-19 మధ్య కొనుగోలు చేసిన వాహనాలకు ఈ ఫలకాలు తయారుచేసి, అమర్చే బాధ్యత లింక్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. రవాణాశాఖ కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబరు ప్రకారం ఫలకాల కోసం వాహనదారులు డబ్బులు చెల్లించినప్పటికీ, అవి తయారయ్యాక కొందరు తీసుకోవడం లేదు. బయట ఇతర ప్లేట్లు అమర్చుకుంటున్నారు.
ప్రస్తుతం లింక్ ఆటో సంస్థ వద్దే దాదాపు 9 లక్షల రిజిస్ట్రేషన్ ప్లేట్లు ఉన్నాయి. 2019 ఏప్రిల్ నుంచి వాహన విక్రయ డీలర్లే ఈ ఫలకాలు అమర్చేలా నిబంధన తెచ్చారు. వాహనం ఇన్వాయిస్ ధరలోనే ప్లేట్‌కు కూడా డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ కూడా కొందరు వాహన కొనుగోలుదారులు.. వీటిని అమర్చుకోవడం లేదు. ఫ్యాన్సీ నంబర్లు పొందినవారు, కొత్త మోడల్స్‌లో బైక్‌లు కొనుగోలు చేస్తున్న యువత సొంతంగా తమకు నచ్చినట్లుగా బయట ప్లేట్లు తయారుచేయించి అమర్చుకుంటున్నారు. ఇలాంటి వాహనాలు 30 శాతం వరకు ఉన్నట్లు అధికారుల అంచనా.
సీసీ కెమెరాలు గుర్తించేలా.. వాహనాలన్నింటికీ ఒకే తరహా అంకెలు, అక్షరాలు, ఫాంట్లు ఉంటాయి. వీటిని స్నాప్‌లాక్ విధానంలో అమర్చుతున్నందున తీసేందుకు వీలుండదు. ప్రమాదాలు చేసినా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా త్వరగా గుర్తించేందుకు వీలుగా వీటిని తయారు చేస్తున్నారు.
- సీసీ కెమెరాలు వీటిని సులువుగా గుర్తిస్తాయి.
- 2019 ఏప్రిల్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనదారుల్లో.. ఈ ప్లేట్లు అమర్చుకోనివారు వాహనం అమ్మిన డీలర్ వద్దకు వెళ్లి బిగించుకోవాల్సి ఉంటుంది.
- 2015-19 మధ్య కొనుగోలు చేసిన వారిలో గతంలోనే ఫీజు చెల్లించి ఉంటే.. రవాణాశాఖ పంపే మెసేజ్‌లో లింక్‌పై క్లిక్ చేసి మిగతా ప్రక్రియ పూర్తి చేయొచ్చు. రిజిస్ట్రేషన్ ప్లేట్ ఏ కార్యాలయంలో ఉందో సమాచారం వస్తుంది. అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది.
- మున్ముందు 2009-15 మధ్య రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు కూడా రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చడంపై దశల వారీగా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.