సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం గుడ్ల మచ్చనూరులో పరిశ్రమల కాలుష్యంపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి, పీసీబీని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ కౌంటర్లు దాఖలు చేయకపోతే తదుపరి విచారణకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది.
కొన్ని పరిశ్రమల నుంచి వెలుపడుతున్న కాలుష్యం వల్ల స్థానిక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధి మొగులయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.
స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటరు దాఖలు చేయలేదని... పీసీబీ నివేదిక అసమగ్రంగా ఉందని హైకోర్టు పేర్కొంది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని, లేనిపక్షంలో సీనియర్ అధికారులు హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణ ఏప్రిల్ 8కి వాయిదా వేసింది.