అంబులెన్సుల నిలిపివేతపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై స్టే విధించింది. అంబులెన్సులను నియంత్రించేలా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంబులెన్సులను ఏ రకంగానూ సర్కారు అడ్డుకోవద్దని సూచించింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి వెంకటకృష్ణారావు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయగా... సీజే జస్టిస్ హిమా కోహ్లి ధర్మాసనం విచారణ చేపట్టింది. అంబులెన్స్‌లను ఆపడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. అంబులెన్స్‌లను అనుమతించేలా ఆదేశాలివ్వాలని ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు.
ఏజీ వివరణ...
నాలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు కరోనా రోగులు వస్తున్నారని ఏజీ వివరించారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రోగులు వస్తున్న క్రమంలో... ఆస్పత్రుల్లో పడకలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారని ఏజీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇతర రాష్ట్రాల రోగులు ఆస్పత్రిలో పడకలు ఉంటేనే రావాలని తెలిపినట్లు వివరించారు. దిల్లీ వంటి రాష్ట్రాలు కూడా ఆంక్షలు విధించాయని గుర్తుచేశారు.
కంట్రోల్‌రూమ్ అనుమతి అక్కర్లేదు...
ఏజీ వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్సులను ఏ రాష్ట్రం ఆపలేదని పేర్కొంది. కారణం ఏదైనా అంబులెన్సులు ఆపే హక్కు ఎవరిచ్చారని సర్కారుని నిలదీసింది. అంబులెన్స్‌లు ఆపడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించింది. అంబులెన్స్‌లు ఆపడం తమ ఆదేశాలు ఉల్లంఘించడం కాదా? అని ప్రశ్నించిన హైకోర్టు... రాజ్యాంగం అందరికీ జీవించే హక్కును కల్పించిందని ఉద్ఘాటించింది. ఆస్పత్రుల్లో చేరేందుకు కంట్రోల్‌రూమ్ అనుమతి అక్కర్లేదని తెలిపింది. ప్రజలు కోరుకుంటే కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేయవచ్చని.. ఫోన్ చేసినవారికి సిబ్బంది సహకరించాలని సూచించింది.
తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. 2 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్రానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది.