మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు...పూర్తిస్థాయి విచారణకు అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. గుంటూరు, విశాఖ జిల్లాల్లో ప్రభుత్వ భూములు, ఆస్తుల విక్రయాన్ని సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన తోట సురేశ్ బాబు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంతో పాటు పలు పిటిషన్లపైనా ఏపీ ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాలతో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ కార్యదర్శులు...అక్టోబర్ 6వ తేదీలోగా కౌంటర్ల దాఖలు చేయాలని, పిటిషనర్లు అక్టోబర్ 9వ తేదీలోగా రిప్లే కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిషన్ బిల్డ్ ఏపీ ద్వారా భూముల వేలాన్ని నిలిపివేయాలని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు: ఏపీ హైకోర్టు
ప్రభుత్వం చేసే ప్రతి పనికి అడ్డుపడుతున్నారని, వారినే పాలించమనాలని విచారణ సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం స్పందిస్తూ...ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో స్పష్టం చేయాలని ఆదేశించింది. హైకోర్టు... రాజకీయ వేదిక కాదని ఏఏజీకి స్పష్టం చేసిన న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్... పూర్తిస్థాయి విచారణ తర్వాతే తీర్పు ఇస్తామని స్పష్టం చేశారు. పిటిషనర్ తరపున ఏపీ హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.
ఇదీ చదవండి : శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమంలో సేవలు ప్రారంభం