కరోనా కేసులు, పరీక్షలు తదితర వివరాలతో ప్రతిరోజు బులెటిన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని సీరం పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. రెండో దశ కరోనా పొంచి ఉందని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం అప్రమత్తం చేసింది.
కరోనాకు సంబంధించి పలు అంశాలపై సీజే జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. జనవరి 25 నుంచి ఈ నెల 12 వరకు చేసిన పరీక్షల వివరాలను పొందుపరిచిన నివేదికను ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. లక్షా 3వేల737 ఆర్టీపీసీఆర్, 4లక్షల83వేల266 యాంటీజెన్ పరీక్షలు చేశామని వెల్లడించింది. జూన్ 3 నుంచి డిసెంబరు వరకు 3సార్లు సీరం సర్వేలు చేశామని వివరించింది.
కేంద్రంతో పాటు రాష్ట్ర సర్కార్ కూడా సొంతంగా సర్వే చేయించాలని హైకోర్టు సూచించింది. సర్వేలో తేలిన అంశాల ఆధారంగా తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. కరోనా బులెటిన్ విడుదల చేసి వెబ్సైట్, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.
రెండో దశ కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందన్న హైకోర్టు.. మహారాష్ట్ర, కర్ణాటకలో కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానంపై విస్తృత ప్రచారం చేయాలన్న హైకోర్టు.. కరోనా కేసుల తదుపరి విచారణ మార్చి 18కి వాయిదా వేసింది.
- ఇదీ చూడండి : 20 రోజుల్లో ఎలా పరిష్కరిస్తారో చూస్తాం: హైకోర్టు