తిరుపతి నగరపాలక సంస్థ ఏడో డివిజన్లో ఎన్నికలు నిలిపివేయాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. సుజాత అనే అభ్యర్థి వేసిన అత్యవసర పిటిషన్పై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు ఎస్ఈసీకి సమయమిస్తూ.. న్యాయమూర్తి జస్టిస్ డీపీఎస్ఎస్ సోమయాజులు విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరించారని.. తెదేపా అభ్యర్థిని ఎం.విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపించిన ఎస్ఈసీ.. ఏడో డివిజన్లో ఎన్నికలు నిలిపివేస్తూ ఈ నెల 4న ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల నిలుపుదలకు ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఎస్ఈసీకి సుజాత తరఫు న్యాయవాది ప్రశాంత్ వాదనలు వినిపించారు. ఒకసారి ఎన్నికలు ప్రారంభం అయ్యాక.. ముగిసే వరకు ప్రక్రియను నిలుపుదల చేయకూడదన్నారు. నామినేషన్ ఉపసంహరణ విషయంలో రిటర్నింగ్ అధికారికి సంబంధం లేదని పేర్కొన్నారు.
ఏజెంట్ మోసం చేశారు..
తెదేపా అభ్యర్థి విజయలక్ష్మి తరఫు ఏజెంట్ మోసానికి పాల్పడ్డారనేది ప్రాథమిక సమాచారమని.. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ కోర్టుకు తెలిపారు. అభ్యర్థి సంతకాన్ని ఫోర్జరీచేసి ఆమెకు తెలియకుండానే.. నామపత్రాలు ఉపసంహరించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి సందర్భాల్లో విచారణ జరిపి.. ఎన్నికను నిలిపివేసే అధికారం ఎస్ఈసీకి ఉందన్నారు. సోమవారం నాటికి పూర్తి వివరాలు వెల్లడవుతాయని వివరించారు.
ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు.. విచారణను సోమవారానికే వాయిదా వేశారు.
ఇవీచూడండి: పట్టభద్రుల పోరు: కీలకంగా మారనున్న రెండో ప్రాధాన్యతా ఓట్లు