fruit market damaged: షియర్ జోన్ ప్రభావంతో కురుస్తున్న భారీవర్షాలకు బాటసింగారం పండ్ల మార్కెట్ వ్యాపారులు, రైతులు భారీగా నష్టపోయారు. ఉదయం కురిసిన భారీ గాలివానలకు హైదరాబాద్ శివారులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ పండ్ల మార్కెట్ టెంట్లు ఎగిరిపోయాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం పండ్ల మార్కెట్‌ను ముంచెత్తింది. పండ్ల దుకాణాలన్నీ తడిసిపోయాయి. ప్రాంగణంలో ఎక్కడపడితే అక్కడ నిల్వ ఉంచిన పండ్లన్నీ తడిసిపోయాయి. వరదనీటిలో బత్తాయి, ఇతర పలు రకాల పండ్లు నీటిలో కొట్టుకుపోతుండటంతో అవి కాపాడుకునేందుకు వ్యాపారులు, సిబ్బంది, రైతులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ట్రేలు, నిల్వ చేసిన పండ్లపై టార్బాలిన్లు కొట్టుకుపోయాయి.
కొత్తపేట గడ్డిఅన్నారం మార్కెట్‌ను తాత్కాలిక ప్రాతిపదికన బాటసింగారం హెచ్‌ఎండీఏ లాజిస్టిక్స్ పార్కులోకి తరలించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక సౌకర్యాలు ఇవాళ్టి వర్షానికి దెబ్బతిన్నాయి. మార్కెటింగ్ శాఖ సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని వ్యాపారులు, రైతులు వాపోతున్నారు. ఇవాళ జరిగిన నష్టం ఎవరూ భర్తీ చేస్తారని కమీషన్ ఏజెంట్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.