ఏపీలోని కృష్ణానది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో... విజయవాడ ప్రకాశం బ్యారేజీ జలకళ సంతరించుకుంది. బ్యారేజీ వద్ద వరద నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం 15 గేట్ల నుంచి 10,830 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి 16 వేల క్యూసెక్కుల నీరు బ్యారేజీలోకి వచ్చి చేరుతోంది.
కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో బ్యారేజీ వద్దకు సుమారు 30 వేల క్యూసెక్కుల నీరు వరకు వస్తుందనే అంచనాతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద నిలకడగా కొనసాగుతున్నందున - నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నాలుగు గంటలపాటు 40 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి వరద నీటిని కిందకు వదిలారు. సాగునీటి కోసం కాల్వలకు 3,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజీ వద్ద గరిష్టంగా నీరు కొనసాగుతుండడంతో ఏలూరు, బందరు, రైవస్ కాల్వలు నిండుగా ప్రవహిస్తున్నాయి.
వరద నీటి విడుదల పెరగడంతో తీరప్రాంతాలు జలమయం అవుతున్నాయి. చుక్కనీరు లేని బుడమేరు వాగు తాజాగా వర్షాలకు జలకళను సంతరించుకుంది. కోతులవాగు, కొండవాగు, కప్పలవాగు నుంచి బుడమేరులోకి నీరు వచ్చి చేరుతోంది.
ఇవీ చూడండి: కొందరిలో కొవిడ్ ఉన్నా.. పరీక్షల్లో నెగిటివ్..