గులాబ్ తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా రూపం దాల్చిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనిప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడే అవకాశముందని వెల్లడించింది. అత్యంత భారీ వర్షాలు హైదరాబాద్లో కురుస్తాయని చెప్పింది. 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురు గాలులుతో కూడిన వర్షాలు పడతాయని వివరించింది.
24 గంటల్లో గులాబ్ తుపాను తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని సంచాలకులు పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం తూర్పు మధ్య పరిసర ఈశాన్య బంగళాఖాతంలోని మయన్మార్ తీరంలో ఏర్పడి సగటు సముద్ర మట్టం నుంచి మధ్యస్త ట్రోపో స్పియర్ ఎత్తు వరకు వ్యాపించి ఉందని వివరించారు.
రాబోయే 4-5 గంటల్లో హైదరాబాద్లో అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ అధికారి నాగరత్న తెలిపారు. చిన్నపాటి చినుకుకే జలమయ్యే నగర రహదారులు భారీ వర్షాలతో చెరువులను తలపిస్తాయని.. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండటానికి ప్రయత్నించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని.. కానీ చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
గులాబ్ తుపాను ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. పలు జిల్లాల్లోని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు నగరాల్లో రహదారులపైకి నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.