శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి మళ్లీ వరద వస్తోంది. 1,46,936 క్యూసెక్కులు నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. జలాశయం ఒక గేటును 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 884.80 అడుగుల నీరు ఉంది. కుడి, ఎడమ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. స్పిల్ వే, విద్యుదుత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌కు 93వేల 784 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని అధికారులు వెల్లడించారు.
పులిచింతలకూ వరద
ఇదిలాఉండగా ఇటీవల గేటు విరగండంతో ఖాళీ అయిన పులిచింతల జలాశయం... క్రమంగా నిండుతోంది. విరిగిన 16వ గేటు స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేశాక ఎగువ నుంచి వస్తున్న నీటితో జలాశయాన్ని అధికారులు నింపుతున్నారు. ప్రస్తుతం పులిచింతల జలాశయానికి.. ఎగువ నుంచి 56వేల 583 క్యూసెక్కుల వరద వస్తోంది. కృష్ణా డెల్టా నీటి అవసరాల కోసం ఒక గేటు ఎత్తి. 8,400 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి కోసం 7 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 17.17 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి ప్రవాహం ఇలాగే కొనసాగితే... మరో నాలుగైదు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఖాళీ ఇలా..
ఏపీలో కృష్ణాడెల్టా స్థిరీకరణే లక్ష్యంగా 2004లో ప్రారంభమైన పులిచింతల ప్రాజెక్టు.. 2013 చివర్లో పూర్తైంది. కేవలం నీటి నిల్వకు మాత్రమే దీనిని ఉపయోగిస్తారు. శ్రీనివాస కన్ స్ట్రక్షన్స్ సంస్థ.. ఈ ప్రాజెక్టు నిర్మించగా.. దాని తరఫున బెకాన్ సంస్థ గేట్లు బిగించే పనులు నిర్వహించింది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 45.77 TMCలు. గతేడాది అత్యధికంగా 8లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పులిచింతలలో మొత్తం 24 గేట్లు ఉండగా నీటి ప్రవాహాన్ని బట్టి వాటిని ఎత్తేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. గురువారం తెల్లవారుజామున కూడా ఇదే క్రమంలో గేట్లు ఎత్తేందుకు యత్నించగా 16వ నంబర్ గేటు 4 అడుగుల మేర పైకి లేచిన తర్వాత ఒక్కసారిగా శబ్దం వచ్చింది. ఏం జరిగిందా? అని చూసేలోపే గేటు విరిగి నీటిలో పడిపోయింది. ఆ తర్వాత స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎగువ నుంచి వచ్చే నీటితో ప్రాజెక్టును నింపుతున్నారు.
ఇదీ చదవండి: Murder: తప్పని చెప్పినందుకు... తల్లిని బండరాయితో కొట్టి చంపిన తనయుడు