రాష్ట్రంలో రేపటి నుంచి పది రోజుల వరకు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మందుబాబులు అప్రమత్తమయ్యారు. లాక్డౌన్ వార్త అందుకున్న వెంటనే మందుకోసం వైన్సులకు పరుగులు తీశారు. చూస్తుండగానే మందు దుకాణాల ముందు చాంతాడంతా క్యూలైన్లు తయారయ్యాయి.
తమకు దగ్గర్లో ఉన్న వైన్సుల ముందు మందుప్రియులు బారులు తీరారు. హైదరాబాద్ నగరంలోని అన్ని వైన్స్‌ల వద్ద దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. క్రమంగా పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో చాలా చోట్ల భౌతిక దూరం పాటించకుండానే క్యూలైన్లలో నిల్చున్నారు.
బంజారాహిల్స్, లక్డీకాపూల్, నారాయణగూడ, ఇందిరాపార్క్, చైతన్యపురి, హయత్‌నగర్‌లోని వైన్సుల ముందు మందుబాబులు బారులు తీరారు. సికింద్రాబాద్, బోలక్‌పూర్, కవాడిగుడ, గాజులరామారం, కుత్బుల్లాపూర్, సూరారం, సుచిత్ర, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌లో ఒక్కసారిగా మద్యం ప్రియులు దుకాణాల వద్దకు చేరగా... రద్దీ ఎక్కువైంది. ఎలాంటి భౌతిక దూరం, మాస్క్‌లు లేకుండానే మద్యం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోని మద్యం దుకాణాల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. భౌతిక దూరం పాటించకుండా మద్యం కోసం ప్రజలు గుమిగూడి కన్పించారు.