అక్టోబరులో కురిసిన భారీవర్షాలతో గ్రేటర్ పరిధిలోని పలు చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లోని వందలాది కాలనీలు నీట మునిగాయి. కొన్ని కాలనీల్లో 20 అడుగుల ఎత్తువరకూ వరద నీరు చేరటం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టాయి. అధికార యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, కాలనీల్లో యువత నడుం బిగించి పలుచోట్ల సహాయక కార్యక్రమాలు చేపట్టారు. కాప్రా, బోడుప్పల్, ఉప్పల్, రామాంతపూర్, బేగంపేట్, ఖైరతాబాద్, టోలిచౌకి, లంగర్‌హౌజ్, గుడి మల్కాపూర్, ఫలక్‌నుమా, కార్వాన్, యాకుత్‌పుర, రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట, సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లోని 2000 కాలనీలు ముంపునకు గురయ్యాయి.
తీసిన కొద్దీ వస్తూనే ఉంది..
‘‘మూడు జేసీబీలు.. నాలుగు లారీలతో మూడ్రోజులుగా చెత్తను తొలగిస్తున్నాం. ఎంత తీసినా చెత్తాచెదారం వస్తూ’నే ఉందంటూ జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. చెత్తకుండీలు లేకపోవటం వల్ల ఇళ్లలో నుంచి వచ్చే వ్యర్థాలను చాలామంది రహదారుల పక్కనే పడేయటం సమస్యకు కారణమంటూ ఆయన విశ్లేషించారు. వరద ఉద్ధృతికి కాలనీల్లో భారీగా చెత్త పేరుకుపోయింది. జీహెచ్‌ఎంసీ అంచనా ప్రకారం కాప్రా, ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, సంతోష్‌నగర్, చాంద్రాయణగుట్ట, కార్వాన్, ఖైరతాబాద్, మల్కాజిగిరి సర్కిళ్ల పరిధిలో 235 కాలనీలు వరద తీవ్రతకు బాగా ప్రభావితమైనట్టు అంచనా వేశారు. 737 వాహనాలతో టన్నుల కొద్దీ చెత్త చెదారం తొలగింపునకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. వీటి పర్యవేక్షణకు ప్రతి సర్కిల్‌కు ఓ అధికారిని కేటాయించారు. వారిలో కొద్దిమంది మాత్రమే బాధితుల ఫోన్‌కాల్స్ స్పందిస్తున్నట్టు సమాచారం. కొన్ని ముంపు ప్రాంతాల్లో స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగించి అధికారులు చూసీచూడనట్టుగా వదిలేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇళ్లలో నుంచి బయటపడేస్తున్న పనికిరాని వస్తువులు, నాలాల నుంచి తీసిన సిల్ట్, బురదతో ఇప్పటికీ పలు కాలనీల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
అమ్మో జ్వరం..
కాయకష్టం చేయనిదే రోజు గడవని జీవితాలు. కరోనా మహమ్మారితో కుదేలయ్యాయి. భారీ వర్షాలు, వరదలు వారిని మరింతగా కుంగదీశాయి. ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో పెరిగిన అపరిశుభ్ర పరిస్థితులతో బాధిత కుటుంబాలను వ్యాధుల భయం వెంటాడుతోంది. జలుబు చేసినా, జ్వరమొచ్చినా ఆందోళనకు గురవుతున్నారు. టోలిచౌకిలోని ఒకే ఇంట్లో ఐదుగురు సభ్యులు విష జ్వరాలతో బాధపడుతుండటం తీవ్రత తెలుపుతోంది. గుడిమల్కాపూర్‌లో అధిక శాతం వీధులను మురుగునీరు కమ్మేస్తోంది. మ్యాన్‌హోళ్ల నుంచి వారం రోజులుగా వ్యర్థాలు బయటకు వస్తున్నా అధికారులు కన్నెత్తి చూడలేదని దుకాణదారులు వాపోయారు. శుక్రవారం పండుగ కావటంతో ఒక్కసారిగా చెత్తాచెదారం భారీగా పెరిగినట్టు జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. వరదనీటితో తడసి పనికిరాకుండా పోయిన గృహోపకరణాలు, వంటసామాగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులను బాధితుల బయట పడేయటం కూడా సమస్యకు మరింత కారణమని మరో అధికారి వివరించారు. కార్వాన్, షేక్‌పేట్, గోల్కొండ, యాకుత్‌పుర, మలక్‌పేట్, సంతోష్‌నగర్, సరూర్‌నగర్ ప్రాంతాల్లోని పలు ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
సాధారణ రోజుల్లో గ్రేటర్‌లో వచ్చే వ్యర్థాలు 5500 టన్నులు
వరదల తరువాత సాధారణ రోజుల్లో కంటే అదనంగా చేరుతున్న వ్యర్థాలు 1000-1200 టన్నులు
వరదలకు ముందు నల్లకుంట ఫీవరాసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య 300
వరదల అనంతరం ప్రస్తుతం నల్లకుంట ఫీవరాసుపత్రికి పెరిగిన రోగుల సంఖ్య 400-450