Hc on tdp leaders house raids: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి... ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో అనంతపురం నాలుగో పట్టణ ఠాణాలో పోలీసులు కేసు నమోదు చేసింది. తెదేపా మహిళ నేతల ఇళ్లల్లోకి చొరబడి సోదాలు చేయడంపై జిల్లా ఎస్పీ ఫక్కిరప్పను పిలిపించి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. మహిళా నేతలపై పెట్టిన కేసు ఏంటి, వారి ఇళ్లలోకి వంటగదుల్లోకి చొరబడి పోలీసులు సోదాలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. అసలు ఏమి జరుగుతోందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై దర్యాప్తు చేసి అఫిడవిట్ వేయాలని ఆదేశిస్తూ దర్యాప్తు అధికారి ఇచ్చిన నివేదికను జతచేస్తూ అఫిడవిట్ వేస్తారా ? అంటూ ఎస్పీని నిలదీసింది. ఆ ఆఫిడవిట్లోనూ ఎలాంటి వివరాలు లేవని ఆక్షేపించింది. ఏ చట్ట నిబంధనల మేరకు సోదాలు చేశారో చెప్పాలని, ఈ వ్యవహారం మొత్తంపై దర్యాప్తు చేసి రెండు వారాల్లో అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేశ్ మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో తెదేపా మహిళ నేతలు టి. స్వప్న, పి. విజయశ్రీ, కె.సి. జానకీ, ఎస్. తేజశ్వికి ముందస్తు బెయిలు మంజూరు చేసిన హైకోర్టు, సోదాలు నిర్వహించడంపై నివేదిక ఇవ్వాలని ఎస్పీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎస్పీ వేసిన నివేదికపై అసంతృప్తి చెందిన న్యాయమూర్తి.. నేరుగా హాజరుకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన విచారణ విచారణకు ఎస్పీ హాజరయ్యారు . పూర్తి వివరాలతో రెండు వారాల్లో అఫిడవిట్ చేస్తానని ఎస్పీ కోర్టుకు తెలిపారు.
ఇదీ చూడండి: Temperatures dropped: గజగజ వణుకుతున్న తెలంగాణ.. నాలుగైదు రోజుల్లో మరింతగా!