ఏపీలో హైకోర్టు సిబ్బందికి కరోనా సోకడం, అందులో ఇద్దరు మృతిచెందడంతో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి ఆధ్వర్యంలో న్యాయమూర్తులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యాజ్యాల దాఖలు పద్ధతులు, విచారణల విధానంపై చర్చించినట్లు తెలిసింది. హైకోర్టు ప్రవేశం వద్ద బాక్స్‌ను ఏర్పాటు చేసి అందులో పిటిషన్ల దస్త్రాలను దాఖలు చేసేలా.. వాటిని ఒకట్రెండు రోజుల తర్వాత శానిటైజేషన్ చేసి వ్యాజ్యానికి నెంబర్ కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం.
విచారణలు ఇంటి వద్ద నుంచి నిర్వహించాలా, కోర్టుకు వచ్చే నిర్వహించాలా అనే విషయంపై.. న్యాయమూర్తులే స్వీయ నిర్ణయం తీసుకోవచ్చనే అభిప్రాయం వెల్లడైనట్లు తెలిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై అధికారికంగా.. ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. సిబ్బందికి కరోనా సోకిన నేపథ్యంలో ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాలరావు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామికి వినతిపత్రం సమర్పించారు. 50 శాతం సిబ్బందితో విధులు నిర్వహించేందుకు అనుమతించాలని, కరోనా తగ్గే వరకూ శనివారం రోజు సెలవు ప్రకటించాలని కోరారు.
- ఇదీ చదవండి : సాగర్‌లో కరోనా కలకలం... ఒక్కరోజే 174 మందికి వైరస్