హయత్‌నగర్‌లో అపహరణకు గురైన ఇబ్రహీంపట్నం బొంగులూర్కు చెందిన యువతి కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఈ రోజు తెల్లవారుజామున ఎంజీబీఎస్ చేరుకున్న యువతి... తెలిసిన మహిళ సాయంతో తల్లిదండ్రులకు సమాచారం అందించింది.
యువతి స్టేట్మెంట్ రికార్డు
యువతి తండ్రి సమాచారం అందించిన వెంటనే పోలీసులు ఎంజీబీఎస్‌కు చేరుకొని యువతిని సరూర్ నగర్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అపహరణకు సంబంధించిన వివరాలను యువతి నుంచి సేకరించారు. వారం రోజుల పాటు నిందితుడు తనను ఎక్కడెక్కడికి తీసుకెళ్లాడనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగం కోసం పలు చోట్ల తిరుగుతున్నట్లు చెప్పాడని, తన తండ్రితో ఫోన్లో మాట్లాడుతున్నట్లు నమ్మించాడని... బాధితురాలు తెలిపింది. యువతి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న తర్వాత పేట్లబురుజు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
బెదిరించి 80 వేల రూపాయలు వసూలు
నిందితుడు రవిశేఖర్ పోలీసుల కన్నుగప్పి వారం రోజుల పాటు పలుచోట్ల తిరిగాడు. సోమవారం ఉదయం నల్గొండ జిల్లా కొండప్రోలు గ్రామానికి వచ్చి ఎరువుల దుకాణ యజమానిని బెదిరించి రూ.80వేల నగదు, 3 ఉంగరాలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అక్కడ పట్టుబడ్డాడు...
నల్గొండ జిల్లా కొండప్రోలు నుంచి గుంటూరు మీదుగా అద్దంకి వెళ్లి అక్కడ యువతిని హైదరాబాద్ బస్సు ఎక్కించినట్లు పోలీసులు భావిస్తున్నారు. యువతి హైదరాబాద్ చేరుకున్న విషయం పోలీసులకు తెలిసిన వెంటనే అద్దంకి, ఒంగోలు పోలీసులను అప్రమత్తం చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా.... రవిశేఖర్ మంగళవారం పోలీసులకు పట్టుబడ్డాడు.