Harish Rao Reacts on Nirmala Sitharaman comments: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రం నిధులు ఉపయోగిస్తే... మోదీ ఫోటో పెట్టాల్సిందేనని మాట్లాడటం దారుణమన్నారు. ప్రధానిగా మన్మోహన్‌సింగ్ ఉన్న సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ రేషన్ షాపుల్లో మన్మోహన్‌సింగ్ ఫొటో పెట్టారా అని ప్రశ్నించారు. ఆనాడు భాజపా పాలిత రాష్ట్రాల్లో ప్రధాని ఫొటో పెట్టారా అని నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం సబబుగా లేదన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై హరీశ్‌రావు 9 పేజీల సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.
కొన్ని పథకాలు లక్ష్యాలు, రాష్ట్రాల ప్రయోజనాలకు తగినట్టు లేవు.. రాష్ట్రానికి వచ్చి 3 విమర్శలు, ఆరు అబద్ధాలు ఆడి రాజకీయం చేస్తానంటే తెలంగాణ సమాజం ఊరుకోదని హరీశ్‌రావు హెచ్చరించారు. తెలంగాణలో మీ పాచిక పారదని భాజపా గుర్తించాలి... రాష్ట్ర ప్రజలను మీ అవాస్తవాలతో గందరగోళ పరుద్దామని మీరే గందరగోళంలో పడ్డట్టు అర్థమవుతుందన్నారు. తెలంగాణ ప్రజలు తెరాస, సీఎం కేసీఆర్‌పైన, ప్రభుత్వ పథకాలపై పూర్తి స్పష్టతతో ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు. ఇలాంటి కుట్ర రాజకీయాలకు స్వస్తి చెప్పాలని పార్టీకి, కేంద్ర మంత్రులకు సూచించారు.
అనవసర పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాల వాటా పెంచి మాపై భారం వేయడం తప్ప కేంద్రం చేసిన మేలు ఏంటి అని ప్రశ్నించారు. పనికి ఆహారపథకం లాంటి మంచి పథకాలకు కొర్రీలు వేస్తూ, వాటికి నిధులు తగ్గిస్తూ , కొత్త నిబంధనలు పెడుతూ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తూ... మోదీ ఫొటో పెట్టాలని రాద్ధాంతం చేయడాన్ని చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రుణాలను నియంత్రించే హక్కు తమకుందని చెబుతున్న కేంద్రం... తాను మాత్రం పరిమితులను దాటి ఎలా అప్పులు చేస్తోందని హరీశ్‌రావు లేఖలో ప్రశ్నించారు.
ఇవీ చదవండి: