విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయాల్లో పండుగ శోభ సంతరించుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ దేవాలయంలో భక్తులు పెద్దఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. పలువురు రాజకీయ నేతలు, సినీనటులు, వేలాదిమంది భక్తులు అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో వాహన పూజలు నిర్వహించారు. విజయదశమి రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని భక్తుల విశ్వాసం.
మంత్రి గంగుల ప్రత్యేక పూజలు..
జగిత్యాల మార్కండేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పూజలు చేశారు. కరీంనగర్‌లోని గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయంలో కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు శమీ పూజ నిర్వహించారు. అయ్యప్ప ఆలయంలో జమ్మిచెట్టుకు పూజ చేశారు. కరీంనగర్‌లోని గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. కరోనా తొలిగిపోయి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు..
వర్దన్నపేటలో పాలపిట్ట దర్శనం..
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి నిర్వహించి ఆయుధ పూజచేశారు. స్వామి వారికి రుద్రాభిషేకం.. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మహబూబాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలందరికీ శుభాలు చేకూరాలని ఎస్పీ రెమారాజేశ్వరి ఆకాక్షించారు. జిల్లా పోలీసు శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి కార్మికులు వేడుకలు చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయుధ పూజచేశారు. నిజామాబాద్‌లో భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. నిర్మల్‌లో శ్రీ దుర్గాదేవి నిమజ్జన శోభయాత్ర కార్యక్రమం వైభవంగా జరిగింది. నవరాత్రులు భక్తులతో విశేష పూజలందుకున్న అమ్మవారికి పట్టణవాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో పాలపిట్ట దర్శనం ఇచ్చింది.
ఇవీచూడండి: దేశవ్యాప్తంగా దసరా సంబరం, రావణ దహనం