రాష్ట్రంలో వరి ధాన్యం దండిగా పండినా సన్నరకం విత్తనాల ధరలు మండిపోతున్నాయి. సన్నరకం విత్తనాలను క్వింటా రూ.4,400 వంతున ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం విక్రయిస్తోంది. ఇవే రకాలను ‘తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ’(టీఎస్ సీడ్స్) రూ.3,100కు అమ్ముతోంది. రెండూ ప్రభుత్వ సంస్థలే.. అయినా ధరలో తేడా ఏకంగా రూ.1,300. దీన్ని ఆసరా చేసుకుని విత్తన కంపెనీలు సన్నరకం విత్తనాలకు రకరకాల ధరలు చెపుతున్నాయి. మార్కెట్‌లో తక్కువలో తక్కువగా క్వింటా రూ.3,500 ధర పలుకుతోంది. బ్రాండ్‌లను బట్టీ పెరుగుదల ఉంటోంది.
35లక్షల ఎకరాల్లో..
గతేడాది వరకూ క్వింటా వరి విత్తనాలపై రూ.వెయ్యి వరకూ రాయితీ భరించిన వ్యవసాయశాఖ ఈ ఏడాది ఇంకా అనుమతి ఇవ్వలేదు. దీంతో విత్తనాల కొనుగోలుపై రైతుల్లో గందరగోళం ఏర్పడింది. వచ్చే నెలలో మొదలయ్యే వానాకాలం(ఖరీఫ్) సీజన్‌లో భారీగా 35లక్షల ఎకరాల్లో సన్నరకాల సాగుకు సర్కారు నిర్ణయించింది. గతేడాది ఖరీఫ్‌తో పోలిస్తే ఈసారి మరో 12లక్షల ఎకరాల్లో సాగు పెంచాలని అధికారులకు సూచించింది. కానీ అంత భారీ విస్తీర్ణంలో సన్నరకాల సాగుకు సరిపడా విత్తనాలు ప్రభుత్వ సంస్థల వద్ద లేవు. రాష్ట్రంలో సన్నరకాల వరి విత్తనాల లభ్యతపై వివరాలను వ్యవసాయశాఖ తాజాగా సేకరించింది.
- ప్రభుత్వ సంస్థల వద్ద మొత్తం లక్షా 41వేల క్వింటాళ్ల సన్నరకం వరి విత్తనాలున్నాయని, ఇవి 5.64లక్షల ఎకరాల సాగుకు సరిపోతాయని తేలింది.
- ప్రైవేటు కంపెనీలు 6.42లక్షల క్వింటాళ్లను ఇస్తామని.. ఇవి 25.70 లక్షల ఎకరాల సాగుకు సరిపోతాయని తెలిపాయి.
- మొత్తంగా సన్నరకాలతో 31.34లక్షల ఎకరాల సాగుకు విత్తనాలున్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది.
- రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాత్రం 55లక్షల ఎకరాలకు సరిపడా సన్నరకం వరి విత్తనాలు మార్కెట్‌లో ఉన్నాయని ప్రభుత్వానికి తెలిపింది.
- రెండు విభాగాల లెక్కల్లో చాలా తేడా ఉండటంతో జిల్లాలవారీగా ఎక్కడెన్ని విత్తనాలున్నాయో సమగ్ర వివరాలు పంపాలని వ్యవసాయశాఖ అన్ని జిల్లాల వ్యవసాయాధికారుల(డీఏవోల)ను ఆదేశించింది.
పాతరకాల విత్తులే అధికం..
సన్నబియ్యం పేరిట జనం మార్కెట్‌లో కొనే రకాల్లో సాంబమసూరి(బీపీటీ 5204), తెలంగాణ సోనా(ఆర్‌ఎన్‌ఆర్ 15048) ప్రధానమైనవి. రాష్ట్రంలోని వరిసాగు మొత్తం విస్తీర్ణంలో వీటి వాటా సుమారు 50 శాతం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సోనా సాగు బాగా పెంచాలని ప్రభుత్వం వ్యవసాయశాఖకు సూచించింది. కానీ, రాష్ట్రమంతా వెతికినా ఈ రకం విత్తనాలు లక్షా 32వేల క్వింటాళ్లే ఉన్నాయి.
వీటితో 5.31లక్షల ఎకరాల్లోనే సాగుకు అవకాశముంది. పాత రకం సాంబమసూరి రకం విత్తనాలే 10లక్షల ఎకరాలకు ఉండటం గమనార్హం. పాత రకాల విత్తనాల సాగును ప్రోత్సహించవద్దని, కొత్తగా మార్కెట్‌లోకి వచ్చినవాటిని రైతులకు విక్రయించాలని కేంద్ర వ్యవసాయశాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. కానీ పాత రకాలే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి.
ఇవీ చదవండి :ఇవాళ కృష్ణా బోర్డు సభ్యులతో జలవనరుల శాఖ అధికారుల భేటీ