కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం పలువురు రహదార్లపైకి రావడమే కాకుండా.. వ్యక్తిగత వాహనాలు భారీగా రోడ్లేక్కిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తామన్న సీఎస్... కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది.
నిత్యావసరాలకు రెండు కిలోమీటర్లలోపే అనుమతి...
ఐదుగురికి మించి ఎక్కడా గుమిగూడరాదని... రహదార్లపైకి ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిత్యావసరాల కోసం ఉంటున్న ప్రాంతం నుంచి ఒకటి, రెండు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వెళ్లాలని సూచించింది. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకు రహదార్లపై ఎవరూ కనిపించరాదని... ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. విదేశాల నుంచి వచ్చిన వారు హోంక్వారంటైన్ నిబంధనలను పూర్తిగా పాటించాలని ఆదేశించారు. బయట తిరిగితే కఠిన చర్యలు ఉంటాయని... పాస్పోర్ట్పైనా చర్యలు తీసుకుంటామన్నారు.
ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే...
అందరి శ్రేయస్సు కోరి ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. వ్యక్తిగత వాహనాలను నిత్యావసర, అత్యవసర పనులకు మాత్రమే ఉపయోగించాలన్నారు. ద్విచక్రవాహనాలపై ఒకరు, నాలుగు చక్రాల వాహనాలపై ఇద్దరికి మించి వెళ్లరాదని స్పష్టం చేశారు. ప్రతి వాహనాన్ని పరిశీలించి సరైన కారణం లేకుండా ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ ఎత్తివేశాకే తిరిగి ఇస్తామని స్పష్టం చేశారు.
మానవాళిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతిఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఉన్నతాధికారులు. జనతా కర్ఫ్యూ తరహాలోనే నెలాఖరు వరకు స్వీయనియంత్రణలో ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి: విదేశాల నుంచి ముంబై మీదుగా రాష్ట్రానికి.. 36 మందిని ఆపిన పోలీసులు