Governor tamilisai about midhani: రక్షణ రంగంలోని ఉత్పత్తుల స్వావలంబనకు హైదరాబాద్‌లోని మిధాని కీలక పాత్ర పోషిస్తోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. ఈ ప్రక్రియలో మిశ్ర ధాతు నిగమ్- మిధాని పాత్ర వెలకట్టలేనిదని ప్రశంసించారు. మిధానిలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన మిధాని ఉత్పత్తుల ప్రదర్శనను గవర్నర్ తిలకించారు. రక్షణ రంగంతో పాటు ఇతర రంగాలకు మిధాని అందిస్తున్న సేవలను తమిళిసై కొనియాడారు.
రక్షణ పరికరాలు, ఇతర వ్యూహాత్మక లోహాల విషయంలో దేశం స్వావలంబన సాధించేందుకు మిధాని అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. చాలా క్లిష్టమైన వస్తువులను అందించటంలో సంస్థ అద్భుతమైన సహకారం అందిస్తున్నట్లు వివరించారు. విస్తృత శ్రేణి లోహాలు, మిశ్రమాల తయారీలోనూ మిధాని కృషి వెలకట్టలేనిదన్నారు. టైటానియం బయో మెడికల్ ఇంప్లాంట్‌లను ఉత్పత్తి చేయడంలో అందించిన సహకారం పట్ల గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నామమాత్రపు ఛార్జీలతో బయోమెడికల్ ఇంఫ్లాంట్‌లను సరఫరా చేయడం ప్రశంసనీయమన్నారు.
అంతరిక్షం, రక్షణ, ఇంధన రంగాలకు సంబంధించిన వివిధ జాతీయ కార్యక్రమాలకు ప్రత్యేక లోహాలు, మిశ్రమాలను సరఫరా చేయడంలో మిధాని కృషిని గవర్నర్ ప్రశంసించారు. జీఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, చంద్రయాన్, మంగళయాన్, గగన్‌యాన్, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, కావేరీ ఇంజిన్, అడ్వాన్స్ అల్ట్రా సూపర్ క్రిటికల్ ప్రోగ్రామ్ వంటి ఎన్నో బృహత్తర కార్యక్రమాల్లో మిధాని బాధ్యతాయుతమైన పాత్ర నెరవేర్చిందని తమిళిసై పేర్కొన్నారు.
ఇదీ చూడండి: