Ruya incident: తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. బాలుడి మృతదేహం తరలింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రుయా సీఎస్‌ఆర్‌ఎంవో సరస్వతీదేవిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు కలెక్టర్ వెంకటరమణారెడ్డి చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. అంబులెన్స్ సిబ్బంది దౌర్జన్యంపై విచారణ జరిపేందుకు ఆర్డీవో, డీఎంహెచ్‌వో, డీఎస్పీ బృందంతో ప్రభుత్వం కమిటీని నియమించింది. అంబులెన్స్ మాఫియా వాస్తవమేనని అధికారులు ధ్రువీకరించారు.
అసలేం జరిగిందంటే: అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన మామిడితోటలో కూలీగా చేసే వ్యక్తి తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ కిడ్నీ, కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో బాలుడు రాత్రి 11గంటల సమయంలో మృతి చెందాడు. బాలుడిని తిరుపతి నుంచి 90కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి రుయా అంబులెన్స్ డ్రైవర్లను అడగ్గా రూ.10వేలు అవుతుందని చెప్పారు. అంత మొత్తం భరించలేని తండ్రి ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తమ బంధువులకు తెలియజేయడంతో వారు ఉచిత అంబులెన్స్‌ను రుయాకు పంపారు.
ఈ క్రమంలో ఆ అంబులెన్స్ డ్రైవర్‌ను రుయా అంబులెన్స్ డ్రైవర్లు కొట్టి పంపేశారు. తమ అంబులెన్స్‌ల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లానని పట్టుబట్టారు. దీంతో బాలుడి తండ్రి చేసేదేమీలేక ద్విచక్రవాహనంలోనే కుమారుడిని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఇటువంటి ఘటనలు గతంలోనూ జరిగాయని స్థానికులు చెబుతున్నారు. అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు గానీ, పోలీసులు గానీ చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: ఎంసెట్ పరీక్ష ఆధారంగా బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీ
ధగధగలాడే 'గోల్డ్ మాస్క్'.. ధర ఎంతంటే...
గుజరాత్‌లోనూ బుల్డోజర్లు.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కూల్చివేతలు