కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... పల్లెల రూపురేఖలను మార్చాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతోంది. ప్రధానంగా గ్రామాల్లో పచ్చదనం, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి చట్టంలోనే పటిష్ట నిబంధనలను పొందుపరిచారు. హరితహారంలో నాటిన మొక్కలు 85శాతానికి తక్కువగా బతికితే సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకునే వెసులుబాటు నూతన పంచాయతీరాజ్ చట్టం కల్పించింది. విద్య, వైద్యం, తాగునీటి నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వమే చూస్తున్నందున గ్రామపంచాయతీలు ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే 60 రోజుల ప్రణాళిక ఖరారు చేశారు. ప్రణాళికలో భాగంగా పవర్ వీక్, హరితహారం నిర్వహిస్తారు. ప్రతి గ్రామంలోనూ డంపింగ్ యార్డ్ కోసం స్థలాన్ని సేకరించాలన్న సీఎం... చెత్తాచెదారం కనిపించకుండా పారిశుద్ధ్య పనులు, మురుగు కాలువలు శుభ్రం చేయాలని స్పష్టం చేశారు. హరితహారంలో భాగంగా గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయడంతో పాటు విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆదేశించారు.
ప్రతీ పంచాయతీకి జనాభా ఆధారంగా ట్రాక్టర్ గానీ మినీట్రాక్టర్తో పాటు నీళ్ల ట్యాంకర్ సమకూర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనంతో పాటు పంచాయతీ రవాణా అవసరాలకు ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: బక్రీద్ ఖుర్బానీ... పెరిగిన పొట్టేళ్ల గిరాకీ