జీహెచ్ఎంసీ 12వ జనరల్ బాడీ సమావేశం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగింది. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి... అధికారుల పనితీరుపై మండి పడ్డారు. గ్రేటర్ పరిధిలో పారిశుద్ధ్య సమస్య రోజురోజుకు పెరిగిపోతోందని... ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోతోందని... అధికారుల స్పందన సక్రమంగా ఉండటం లేదని కార్పొరేటర్లు మండి పడ్డారు. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో రోడ్లు ఊడ్చడానికి సిబ్బంది కొరత ఉందని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు.
నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు
చెత్త సేకరణకు కొత్త వాహనాలను ఏర్పాటు చేయడంతోపాటు నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ సమాధానమిచ్చారు. చెత్త ట్రాన్స్ఫర్ కేంద్రాలను ఆధునీకరించి వాసన రాకుండా చూస్తామన్నారు. కొత్తగా నియమించే కార్మికుల విషయంపై మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టతనిచ్చారు. ప్రధాన రోడ్లలో త్వరలో మరిన్ని స్వీపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఆర్టీసీకి చెల్లించాల్సిన అవసరం లేదు : మేయర్
కౌన్సిల్ సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యులు ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్, రామచందర్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు హాజరయ్యారు. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు ఎంత చెల్లించింది.. ఇంకా చెల్లించాల్సిన బకాయిలు ఎంత?...వాటిని చెల్లిస్తారా లేదా అనే అంశాలను తెలియజేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీకి తమకు వెసులు బాటు ఉన్నప్పుడు చెల్లించామని ఇప్పుడు డబ్బులు చెల్లించలేమని కౌన్సిల్ తీర్మానించిందని మేయర్ సమధానమిచ్చారు. తాము చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు మేయర్.
సమస్యలు పరిష్కారం కావట్లేదు
బల్దియా కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు తమ తమ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి అధికారులు ఎక్కడికక్కడ కార్పొరేటర్లతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మేయర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చూడండి: ట్రాఫిక్ చిక్కులను ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు