Lady constables Issue: ఏపీలోని నెల్లూరులో మహిళా కానిస్టేబుళ్లకు యూనిఫాం కుట్టే విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయం విమర్శల పాలైంది. పట్టణంలోని ఉమేశ్‌చంద్ర హాలులో సోమవారం సచివాలయ మహిళా కానిస్టేబుళ్లకు యూనిఫాం కోసం పురుష టైలర్‌తో కొలతలు తీయించారు. అక్కడే కొందరు మహిళా పోలీసులు ఉన్నా, వారితో కొలతలు తీయించకుండా జెంట్ టైలర్ కొలతలు తీసుకోవడంతో మహిళా కానిస్టేబుళ్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థంకాక ఇబ్బంది పడుతూనే కొలతలు ఇచ్చారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు మీడియాకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులకు పురుష టైలర్ కొలతలు తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా... ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. "మహిళలకు పురుష టైలర్‌తో కొలతలు తీయించడమేంటి? మీ ఇంట్లో ఆడవాళ్లకైతే ఇలాగే కొలతలు తీయిస్తారా?" అని ప్రశ్నించారు.
పోలీసులేమన్నారంటే..?
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విజయారావు స్పందించారు. మహిళా పోలీస్‌లకు సంబంధించి యూనిఫామ్ బాధ్యతలను ఔట్ సోర్సింగ్‌కు అప్పజెప్పామని ఒక పురుషుడు కొలతలు తీసినట్లు తెలిసిన వెంటనే స్పందించి దానిని సరిదిద్దామని ఎస్పీ వివరణ ఇచ్చారు. ఈ ప్రక్రియకు ఏఎస్పీ వెంకటరత్నమ్మ ఇంఛార్జిగా ఉన్నారని, మహిళా పోలీసుల దుస్తుల కొలతలు తీసేందుకు మహిళలనే నియమించామని తెలిపారు.
చర్యలు తీసుకుంటాం..
"మహిళా పోలీస్ కానిస్టేబుల్స్‌కి యూనిఫాం కుట్టించే బాధ్యతలను ఔట్సోర్సింగ్ వాళ్లకు అప్పజెప్పాం. కొలతలు తీసుకునే కార్యక్రమం మహిళా పోలీసు అధికారుల సమక్షంలోనే జరుగుతుంది. ఒక పురుషుడు కొలతలు తీసినట్లు తెలిసిన వెంటనే దానిని సరిదిద్దాం. ఈ ప్రాంతంలో పురుషులకు ఎలాంటి అనుమతి లేదు. కానీ.. ఓ వ్యక్తి ఎవరికి తెలియకుండా లోపలికి ప్రవేశించాడు. మొబైల్ కెమెరాతో ఫొటోలు తీసి వాటిని వైరల్ చేశాడు. మహిళల ప్రైవసీకి భంగం కలిగించినందుకు ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటాం." - ఎస్పీ విజయారావు
మహిళా టైలర్లు లేని కారణంగానే..
మహిళా టైలర్లు లేని కారణంగానే..యూనిఫాం కొలతలు పురుషులతో తీయించాల్సి వచ్చిందని నెల్లూరు ఏఎస్పీ వెంకటరత్నం తెలిపారు. దీనిపై అనవసర రాద్దాంతం చేయడం సరికాదన్నారు.
"పోలీసు యూనిఫాం కుట్టే లేడీస్ టైలర్స్ తక్కువగా ఉన్నారు. యూనిఫాం కుట్టే బాధ్యతను బయటి వారికి అప్పజెప్పాం. మహిళా పోలీసులకు కొలతలు ఎలా తీసుకోవాలో తెలియదు. కొలతలు రాసుకునేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు...కొలతలు ఎలా తీసుకోవాలో ఒకరిద్దరికి కొలతలు తీసుకొని చూపించారు. అంతేకానీ వారు అందరికీ కొలతలు తీసుకోలేదు. మహిళా పోలీసులే కొలతలు తీసుకున్నారు. వారు కేవలం కొలతలు రాసుకోవటానికి మాత్రమే వచ్చారు. ఎవరో కావాలనే దీనిపై రాద్దాంతం చేస్తున్నారు." -వెంకటరత్నం, ఏఎస్పీ
ఇదీ చదవండి: