గంధగీ ముక్త భారత్ (జీఎంబీ) కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రఘునందన్‌రావు ఆదేశించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత పట్ల ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఈ నెల 8 నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఈ వారోత్సవాల అమలుపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు రఘునందన్‌రావు మార్గదర్శకాలు జారీచేశారు.
ఇవీ మార్గదర్శకాలు
- 8న సర్పంచులతో జిల్లా కలెక్టర్లు సమావేశం నిర్వహించాలి.
- 9న సర్పంచుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించాలి. వాటి నుంచి ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ను వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
- 10న గ్రామ పంచాయతీలస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేసేందుకు శ్రమదానం కార్యక్రమం చేపట్టాలి. శ్రమదానంపై చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నంబరు (18001800404) కేటాయించింది.
- 11న పరిశుభ్రతపై ప్రేరణ కలిగించేలా, ప్రజలంతా ఉద్యమించేలా గ్రామాల్లో గోడలపై చిత్రాలు (వాల్ పెయింటింగ్) గీయించాలి. దీనికి సంబంధించి 5 చిత్రాల నమూనాలను జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే పంపారు.
- 12న మొక్కలు నాటడం, శ్రమదానం నిర్వహించాలి.
- 13న ‘నా గ్రామం మురికి రహితం’ అంశంపై 6, 7 తరగతుల విద్యార్థులకు పెయింటింగ్; 9, 10 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలి.
- 14న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలి.
- 15న గ్రామసభలు నిర్వహించి ప్రమాణం చేయించాలి. స్థానికంగా మరిన్ని ప్రయోగాత్మక కార్యక్రమాలు కూడా చేపట్టవచ్చు.
ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!