సెప్టెంబర్ ఒకటి నుంచి హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. కొత్తపేటలోని కమిటీ కార్యాలయంలో ఏఎంసీ ఛైర్మన్ వీరమల్లు రామనర్సయగౌడ్ అధ్యక్షతన పాలకవర్గం సమావేశం జరిగింది. గడ్డిఅన్నారం మార్కెట్ కొహెడకు తరలించే విషయంలో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం.. మార్కెటింగ్ శాఖ, కమీషన్ ఏజెంట్లు, హమాలీ వర్గాలు, రైతుల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని కొహెడకు వెళ్లబోమని తెగేసి చెప్పిన వ్యాపారులు.. రోడ్లపైనే వ్యాపారాలు సాగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో జులై 12 నుంచి గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ మూతపడగా.. నాటి నుంచి రైతులు తమ పండ్ల ఉత్పత్తులు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై వాడివేడిగా చర్చించిన కమిటీ.. మార్కెట్ పునఃప్రారంభానికే మెగ్గు చూపింది.
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు త్వరలో కొహెడలో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్ తయారు చేస్తామని ఏఎంసీ ఛైర్మన్ రామనర్సయ్యగౌడ్ అన్నారు. ఈలోగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గడ్డిఅన్నారం మార్కెట్లో కార్యకలాపాలు కొనసాగిస్తామని తెలిపారు. రైతులు, కమీషన్ ఏజెంట్లు, హమాలీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: 'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి'