ప్రకృతి వైపరిత్యాలు... విత్తన కష్టాలు... లభించని గిట్టుబాటు ధరతో వ్యవసాయం నానాటికీ భారంగా మారుతోంది. రేయీపగలు శ్రమించినా అన్నదాతకు చివరకు మిగిలేది రెక్కల కష్టం...అప్పుల భారం! అభిమన్యుడిలా పోరాడుతూ పంటలు పండించే రైతన్న వీరమరణం పొందుతున్నాడు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ వృత్తిలో తమ బిడ్డలను కొనసాగనిచ్చేందుకు రైతు కుటుంబాలు ఆసక్తి చూపడం లేదు. దేశంలో 48శాతం రైతులు ఇదే అభిప్రాయంతో ఉన్నారని గ్రామీణ సమాచార వేదిక ‘గావ్ కనెక్షన్ నివేదికలో పేర్కొంది.
సవాల్ విసురుతున్న ప్రకృతి
ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న రాయితీ రుణ పథకాలు గ్రామీణ కర్షకులకు పూర్తిస్థాయిలో చేరటంలేదని... దాదాపు 59 శాతం మందికి ఆ సమాచారమే తెలియటంలేదని తేలింది. అప్పుల భారం, గిట్టుబాటు ధరలు లేకపోవడం... వాతావరణ మార్పులు సవాళ్లుగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు.
వేడుకలకే ఖర్చైపోతోంది
ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బంగా, తెలంగాణ సహా 19 రాష్ట్రాల్లో తిరిగిన ఈ సంస్థ ప్రతినిధులు 18,000 మంది గ్రామీణ రైతులను కలిసి అభిప్రాయ సేకరణ చేపట్టారు. గ్రామీణుల సంపాదనలో అధిక భాగం కుటుంబ వేడుకలకే ఖర్చైపోతోందని, 10శాతం మందే పొదుపు చేయగలుగుతున్నారని నివేదిక పేర్కొంది.
వారి మనసు ప్రభుత్వాలెరుగవు
కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో గ్రామీణ సమస్యలు ప్రతిబింబిస్తూ నివేదికను వెల్లడించింది. గ్రామీణుల మనసులో ఏముందో తెలిపే విశ్వసనీయమైన సాధనాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద లేవని, తమ సర్వే గ్రామీణుల వాస్తవ ప్రాధాన్యాలు తెలుసుకొనే యత్నం చేసిందని ‘గావ్ కనెక్షన్’ వ్యవస్థాపకుడు నీలేశ్ మిశ్రా తెలిపారు.
ధర రైతులే నిర్ణయించాలి
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కోసం 44 శాతం మంది ప్రభుత్వాసుపత్రికి వెళ్తుంటే... ప్రైవేటు డాక్టర్‌ను 36 శాతమంది ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే రుణపథకాల గురించి తెలియడం లేదని 59 శాతం మంది చెప్పారు. 25శాతం మంది 50వేల లోపు రుణం తీసుకుంటే... ఐదు లక్షల లోపు రుణాలు పొందిన వారు 15 శాతమే ఉన్నారు. రుణ భారమే పెద్ద సమస్యగా మారిందన్నవారు 13 శాతం మంది ఉంటే... వాతావరణంలో ఆకస్మిక మార్పులే పెద్ద సవాలుగా భావించేవారు 19 శాతం. సాగునీరు అందిస్తే చాలు అనేక సమస్యలు తీరుతాయని ఆశపడేవారు 41శాతం మంది. పంటల విక్రయ ధరలను రైతులే నిర్ణయించుకోవాలని గట్టిగా చెబుతున్నవారి సంఖ్య 62 శాతంగా ఉంది. 43. 6శాతం మంది గిట్టుబాటు ధరలు సరిగా లేవని చెబుతున్నారు. ప్రస్తుత పంటల ధరల విధానం 30 శాతం మంది సంతృప్తితో ఉన్నారు. పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరుగుతోందని ఆందోళన చెందుతోంది 17 శాతం మంది. డీజిల్ ధరలపై అసంతృప్తి వ్యక్తం చేసింది 20 శాతం మంది.
నీటికోసం అర కిలోమీటరు నడక
38 శాతం మంది రైతులు సామాజిక మాధ్యమాలు వినియోగిస్తోంటే... సమాచారం కోసం ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్న వారు 30 శాతంగా ఉన్నారు. ఆండ్రాయిడ్‌సెల్‌ఫోన్ లేనివారు 15శాతం ఉన్నారు. గ్రామాల్లో చేతి పంపుల ద్వారా నీరు పొందుతున్నవారు 61శాతం మంది ఉంటే... గొట్టపు మార్గాల ద్వారా 8శాతం నీరు పొందుతున్నారు. నీటి కోసం సగటున అర కిలోమీటరు నడుస్తున్నామని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు చెబుతున్నారు. పోలీసుల విధులపై 35శాతం మంది సంతృప్తి వ్యక్తం చేస్తే... అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అరోపిస్తోంది 26.1 శాతం మంది.
ఇదీ చూడండి : శంకరమ్మ ... ఇచ్చింది మరోజన్మ