Attack on Assistant Engineer: హైదరాబాద్‌లోని టపాఛబుత్ర పరిధిలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్‌పై యువకులు చేసిన హల్చల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కొందరు యువకులు ఏఈ ఆఫీసుకు వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇష్టమున్నట్టు దుర్భాషలాడారు. ఆవేశంతో సబ్ ఇంజినీర్‌పై దాడి చేశారు. అక్కడే ఉన్న సిబ్బంది ఎంత నిలువరించిన ఆగలేదు. ఓ యువకుడైతే ఏకంగా ఇంజినీర్పైకి దూసుకొచ్చి.. టేబుల్ ఎక్కి మరీ కాలితో ఛాతిలో తన్నాడు. పిడిగుద్దులతో సబ్ ఇంజినీర్ని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ తతంగం మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. అసలు.. దాడికి దిగిన కుర్రాడెవరు..? గొడవకు కారణమేంటంటే..?
కార్వాన్ విద్యుత్ సహాయ ఇంజినీర్ విజయ్ కుమార్ ఈరోజు ఉదయం.. లైన్‌మెన్‌తో కలిసి విద్యుత్ బకాయిలను వసూళ్లు చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో టపాఛబుత్ర పీఎస్ పరిధిలోని వాల్మీకినగర్‌లో ఓ ఇంటికి సంబంధించి పెండింగ్ బిల్లును చూసి ఆవాక్కయ్యాడు. ఆ ఇంటికి సంబంధించి రెండేళ్లుగా కరెంటు బిల్లు కట్టట్లేదు. దాదాపు 15 వేల రూపాయలు పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఇంట్లో ఉన్న మహిళ దృష్టికి తీసుకెళ్లారు. కనెక్షన్ కూడా తొలగించారు. బిల్లు కట్టిన తర్వాతే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని చెప్పి వచ్చేశారు.
కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన మహిళ కుమాడు విశాల్(22).. విద్యుత్ కనెక్షన్ తొలగించిన సంగతి తెలుసుకొని ఆవేశంతో తన స్నేహితులను తీసుకుని కార్వాన్‌లోని విద్యుత్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న విజయ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగాడు. అతని స్నేహితులతో కలిసి విజయ్‌కుమార్‌ను నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించాడు. అక్కడ ఉన్న విద్యుత్ సిబ్బంది వారించినా ఏమాత్రం లెక్కచేయకుండా.. విశాల్ దాడికి దిగాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగకుండా దాడికి తెగబడ్డాడు. పట్టరాని ఆవేశంతో ఉన్న విశాత్.. టేబుల్ ఎక్కి మరీ ఏఈ విజయ్‌కుమార్ ఛాతితో తన్నాడు. ఈక్రమంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాసేపటి తర్వాత విశాల్, అతని తల్లి, స్నేహితులు ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.
ఈ తతంగాన్ని మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఏఈ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఏఈపై దాడికి దిగిన విశాల్‌ను అరెస్ట్ చేసి.. విచారిస్తున్నారు. విజయ్‌కుమార్‌కు ఛాతిలో తన్నటంతో.. నొప్పిగా ఉండటంతో వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో పాలుపంచుకున్న అందరిపైన కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని టపాఛబుత్ర పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: