రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల నుంచి రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. యూరియా కోసం క్యూలో నిలబడి నానా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా సరఫరాలో ప్రభుత్వ వైఖరిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా తూఫ్రాన్‌లో మూడు రోజులుగా యూరియా దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాయిపల్లికి చెందిన ఎల్లయ్య అనే రైతు మూడు రోజులుగా క్యూలో నిలబడి గుండెపోటుతో మృతి చెందారు.
కామారెడ్డి జిల్లా దోమకొండలో యూరియా కోసం రైతులు ఉదయం 5గంటల నుంచే ప్రాథమిక సహకార కేంద్రం ముందు క్యూ లైన్లో నిలబడుతున్నారు. మూడు రోజుల నుంచి ఇంత శ్రమిస్తున్నా... యూరియా మాత్రం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా మోపాల్‌లో రైతులు రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. మెదక్ జిల్లా శివ్వంపేటలో యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి ఐదు రోజుల నుంచి తిరుగుతున్నామని రైతులు తెలిపారు.
ఇదీ చూడండి: వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులకు సెలవుల రద్దు!