Former minister Narayana: శస్త్రచికిత్స నిమిత్త అమెరికా వెళ్లకుండా తనను అడ్డుకునేందుకు లుక్ అవుట్ సర్క్యులర్(ఎల్‌ఓసీ) జారీచేశారని, దానిని రద్దు చేయాలని కోరుతూ ఏపీ మాజీ మంత్రి నారాయణ సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వైద్యం కోసం అమెరికాకు వెళ్లేందుకు ఇప్పటికే హైకోర్టు అనుమతి ఇచ్చిందని ఆ ఉత్తర్వులన ఉల్లంఘిస్తూ ఎల్‌ఓసీ జారీచేశారన్నారు. రాజకీయ కక్షతో వేధించడం కోసం పలు కేసులు తనపై నమోదు చేశారని ఆరోపించారు.
ఆయా నేరాలతో తనకు సంబంధం లేదన్నారు. సీఐడీ నమోదు చేసిన ఐదు కేసులతోపాటు పాటు మొత్తం ఏడు కేసులు పెట్టారని... ఇవన్ని రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక నమోదు చేసినవే అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనను అమెరికాలో చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించారని స్పష్టం చేశారు. అక్కడికి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు.
హైకోర్టు షరతు.. రాజధాని రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పు వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు సందర్భంగా దేశం విడిచివెళ్లొద్దని హైకోర్టు షరతు పెట్టింది. చికిత్సకోసం అమెరికా వెళ్లాల్సిన పరిస్థితిని కోర్టుకు వివరించి షరతును సడలించుకున్నామని నారాయణ తెలిపారు. అమెరికాకు వెళ్లేందుకు న్యాయస్థానం మూడు నెలల సమయం ఇచ్చిందని... ఇతర కేసుల్లో పోలీసులు తనను అరెస్ట్ చేసి అమెరికాకు వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఇలాంటి చర్య జీవించే, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. ఎసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణతో సీఐడీ నమోదు చేసిన కేసులోనూ తాజాగా హైకోర్టులో వ్యాజ్యం వేసి శస్త్రచికిత్సకు అమెరికా వెళ్లేందుకు అనుమతి పొందానన్నారు. ఈ పరిణామాల అనంతరం తనపై ఎల్‌వోసీ జారీచేసినట్లు తెలిసిందని చెప్పారు. ఇదంతా శస్త్రచికిత్స కోసం విదేశం వెళ్లకుండా తనను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని తెలిపారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని నాపై జారీచేసిన ఎల్‌వోసీని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోర్టును కోరారు.
శస్త్రచికిత్స కోసం మూడు నెలల పాటు అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇచ్చేలా కేంద్ర హోంశాఖ(బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్) కమిషనర్‌ను ఆదేశించాలని కోరారు. కేంద్ర హోంశాఖ(బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్) కమిషనర్, ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సీఐడీ ఏడీజీ, మంగళగిరి సీఐడీ ఎస్‌హెచ్‌వో, చిత్తూరు, కడప ఎస్పీలు, తదితరులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇవీ చదవండి: