Godavari floods: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు.. గోదావరి నదిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 9.5 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి.. 7లక్షల 16వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. తూర్పు, మధ్య, పశ్చిమ కాల్వలకు 4 వేల క్యూసెక్కుల నీరు సరఫరా చేశారు. వరద ఉద్ధృతిని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సహాయ చర్యల కోసం 2 ఎన్డీఆర్ఎఫ్, 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బోట్లు, స్టీమర్లలో నదిలో ప్రయాణించవద్దని సూచించారు. రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి పరవళ్లు తొక్కుతోంది. నది పరివాహక ప్రాంతాల్లో వరద అంతకంతకు పెరిగిపోతోంది. మంజీర, ప్రాణహిత నుంచి గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం నుంచి అధిక వరద ప్రవాహం రాజమహేంద్రవరానికి వస్తోంది.
కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజలు పడవలు మీద రాకపోకలు సాగిస్తున్నారు. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో.. చాకలిపాలెం సమీపంలోని కాజ్వే ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తుండడంతో.. అధికారులు అమలాపురం కలెక్టరేట్ వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
Polavaram: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద జలకల సంతరించుకుంది. భారీ స్థాయిలో వరదనీరు పోలవరం ప్రాజెక్టులో వచ్చి చేరాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రాజెక్టు స్పీల్ వేలో.. 48 రేడియల్ గేట్ల ద్వారా 7 లక్షల క్యూసెక్కులకు పైగా గోదావరి వరద జలాలు.. దిగువకు చేరుతున్నాయి. స్పీల్ వే వద్ద.. 31.3మీటర్ల వరద ఉద్ధృతి నమోదైందని పోలవరం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లో 7 లక్షల 57 వేల క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో కూడా అంతే నమోదవుతుంది. గోదావరికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు దగ్గర వరద ఉద్ధృతి తీవ్రస్థాయికి చేరడంతో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రాజెక్టు వద్ద పరిస్థితిని పరిశీలించారు. స్పిల్ వే గేట్ల వద్ద నుంచి దిగువకు చేరుతున్న జలాల వివరాలు, ఎగువ, దిగువ కాపర్ డాం పరిస్థితి తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వరద కారణంగా గోదావరిలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతుండడంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని.. అదేవిధంగా దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే ప్రాజెక్టులో ఎగురు కాఫర్ డ్యామ్ వద్ద వరద పరిస్థితిని జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు.
ఒడిశా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలలో అధికంగా వర్షాలు కురవడంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరివాహక ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలు మండలాలలో గోదావరి నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉంది. గండిపోచమ్మ ఆలయం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. మరోవైపు ఎటపాక మండలం నెల్లిపాక గ్రామం రమణపేట రహదారిపై గోదావరి నీరు రెండు అడుగుల మేర నిలిచిపోయింది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలం వద్ద గల కాపర్ డ్యాం వద్ద గోదావరి నీటిమట్టం 49.90 అడుగులుగా నమోదైంది.
కాకినాడలోని ఏలేశ్వరం వద్ద ఏలేరులో.. ఇద్దరు యువకులు స్నానానికి దిగారు. కాగా.. వాగు నీటి ఉద్ధృతికి వారు మునిగిపోతుండగా.. ఒకరిని స్థానికులు రక్షించగా, మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన యువకుడు ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి వాసులుగా గుర్తించారు.
ఇవీ చూడండి: