రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు.. అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి పాడే ఉయ్యాల పాటలు, వివిధ రకాల పదార్థాలతో రుచికరంగా తయారు చేసే నైవేద్యాలు.. వెరసి తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేవే బతుకమ్మ పండుగ సంబురాలు (telangana bathukamma celebrations in 2021). మహాలయ అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మహిళలెంతగానో ముచ్చటపడి ఆడే బతుకమ్మను రోజుకో పేరుతో పిలుస్తూ.. తీరొక్క పూలతో పేరుస్తూ... ప్రత్యేకమైన నైవేద్యాలతో కొలుస్తారు. ఇవాళ ఐదో రోజు(Bathukamma day 5) సందర్భంగా అట్ల బతుకమ్మను(atla bathukamma) పేరుస్తారు. ఈ రోజున అట్లు తయారు చేసి అమ్మకు నివేదిస్తారు.
అట్ల బతుకమ్మ
ఐదో రోజున బతుకమ్మను 'అట్ల బతుకమ్మ'(atla bathukamma) అంటారు. ఈ రోజున అట్లు తయారు చేసి అమ్మకు నివేదిస్తారు. బియ్యం పిండి, రవ్వతో ఈ అట్లను తయారు చేస్తారు. బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత మహిళలందరూ ఈ అట్లను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఐదో రోజును పురస్కరించుకొని తంగేడు, గునుగు, చామంతి, బంతి, గుమ్మడి, మందార పూలతో ఐదంతరాల బతుకమ్మను పేరుస్తారు. వలయాకార తాంబాలం లేదా ప్లేటులో ఈ ఐదంతరాల బతుకమ్మను పేర్చి... సాయంత్రం వేళలో కోలాటాలు చేస్తారు. బతుకమ్మను చుట్టూ పెట్టి... ఉయ్యాల పాటలు పాడుతారు. అనంతరం బతుకమ్మను గంగమ్మ చెంతకు చేర్చి... తమతో తీసుకొచ్చిన ప్రసాదాలను ఒకరికొకరు పంచుకుంటారు.
కోలాటాల కోలాహలం
సాయంత్రం వేళ విశాలమైన ప్రదేశంలో తొలుత వెంపలి చెట్టును నాటి... దానిపై పసుపు కుంకుమను చల్లుతారు. అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ ఉంచుతారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కోలాటాలు చేస్తారు. మరికొందరు చేతిలో రెండు కర్రలను పట్టుకొని కోలాటం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...., ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములాయే చందమామ..., పసుపుల పుట్టింది గౌరమ్మా... పసుపుల పెరిగింది గౌరమ్మా... అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతారు. బంధాలు, బంధుత్వాలపైనా పాటలు పాడుతారు. చివరగా ఆ బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చుతారు.
తెలంగాణ బతుకు పండుగ
అచ్చమైన పల్లెసంస్కృతికి అద్దం పట్టే మట్టిమనుషుల పండుగ బతుకమ్మ. తెలంగాణ మనుషుల బతుకు పండుగ ఈ బతుకమ్మ. పూల పండుగ సందర్భంగా ఆడబిడ్డలతో తెలంగాణ లోగిళ్లు కళకళలాడుతున్నాయి. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో పండుగ సందడి నెలకొంది. ప్రతీ ఆడబిడ్డ ఈ పండుగకు పుట్టింటికి పోతుంది. పిండి వంటల ఘుమఘుమలు... పుట్టినింట్లో ఆడబిడ్డల చిరునవ్వులు, బంధుమిత్రుల కోలాహలం.. పిల్లపాపలతో ఇళ్లు కళకళలాడుతున్నాయి. ఓ పక్కన పెద్దలు బతుకమ్మ ఆడుకుంటుంటే.. మరోపక్కన పిల్లలు కేరింతలు కొడుతుంటారు. తొమ్మిది రోజుల పాటు పిల్లాపెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మ సంబురాలను జరుపుకుంటున్నారు.
ఇవీ చదవండి: