
నిర్దేశించిన లక్ష్యాల దిశగా తాను చొరవ చూపుతూ, తనతో ఉండేవారిని సమాయత్తపరచగలిగే సామర్థ్యం ఉండటమే నాయకత్వం (లీడర్‌షిప్). మార్చును స్వాగతించడం, కొత్త గమ్యాల దిశగా తన బృందాన్ని ముందుకు నడిపి అసాధారణ ఫలితాలను రాబట్టడాన్ని లీడర్‌షిప్ నైపుణ్యంగా పరిగణిస్తారు. ఉద్యోగులు వేలల్లో ఉన్నా నాయకత్వ లక్షణాలున్న విలువైన సిబ్బంది కోసం కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు ఎదురుచూస్తుంటాయి. నాయకుడి లక్షణాలను చూస్తే..
చొరవ-చురుకుదనం
ఒక టీమ్‌లో అందరూ యధాలాపంగా కేవలం చెప్పినవరకు పనిచేస్తుంటే, నాయకుడు సదరు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటాడు. పనిలో అవరోధాలకు వెరవడు. కుంటి సాకులు చెప్పి పనికి విరామం ఇవ్వడు.
తోటివారి సహకారం
బృందంలో అందరూ ఎవరి పని వారు చేసుకుపోతుంటే- లీడర్ తన పనితోపాటు ఇతరుల పని తీరుతెన్నులను గమనిస్తుంటాడు. అవసరమైతే తానొక చేయివేసి వారి మన్నన పొందుతాడు. తద్వారా ఇష్టపూర్వకంగా వారి సహకారం లభిస్తుంది.
నాయకత్వ నైపుణ్యాల సాధనకు ఏం చేయాలి?
ఆత్మ స్థైర్యం: నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం ఆత్మవిశ్వాసం. తానున్న పరిస్థితులపై ఆకళింపు, లక్ష్యాల గుర్తింపు, తీసుకునే నిర్ణయంతో గమ్యం చేరగలమన్న స్థైర్యం ఉంటేనే రాణించగలుగుతారు.
నిర్ణయ సామర్థ్యం: నాయకత్వ స్థాయికి ఎదగాలంటే ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోగలగాలి. రాబోయే పర్యవసానాలకు భయపడి నిర్ణయాలు వాయిదా వేస్తే ఎప్పటికీ నాయకులు కాలేరు.
నిలకడ మనస్తత్వం: ఏ ఎండకా గొడుగు పట్టే పరాధీనత ఉంటే బృందంలోని సభ్యులకు నమ్మకం పోతుంది. అందుకే లీడర్‌కు స్థిర మనస్తత్వం, ఆటుపోట్లను తట్టుకునే సత్తా ఉండాలి.
నిజాయతీ: విశ్వసనీయతే నాయకత్వానికి గీటురాయి. ఆలోచనల్లో, మాటల్లో, నడవడిలో నిజాయతీ చూపడం మంచి నాయకుడి లక్షణం. అటువంటివారినే సభ్యులు నమ్ముతారు; కలిసి నడుస్తారు.
- యస్.వి. సురేష్
ఇదీ చూడండి: ఆమె గురించి ఆలోచించండి.. ఆమెతో కాస్త సమయం గడపండి