ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేయాలంటూ... జీఎన్ రావు కమిటీ ఇచ్చిన సిఫార్సులపై... అమరావతి రైతులు చేస్తున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనలతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది. ఏపీ సచివాలయం సహా ప్రధాన రహదారులను దిగ్బంధించిన రైతులు... వంటా వార్పు నిర్వహించారు. తమ జీవితాలతో ఆడుకోవద్దని నినదించారు.
రైతుల ఆందోళనకు పలువురు న్యాయవాదులు, రాజకీయ పార్టీల నేతలు మద్దతు పలికారు. రాజధాని తరలింపు ప్రక్రియను ఆంధ్రా ప్రభుత్వం విరమించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తమ తల్లిదండ్రులు భూములిచ్చారని... ఇప్పుడు తమ భవిష్యత్తే అగమ్యగోచరంగా తయారైందని... అన్నదాతల పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆందోళనలు ఉద్ధృతం చేసిన రైతులు... నేడు అమరావతి ప్రాంతంలోని ఉద్దండరాయినిపాలెం శంకుస్థాపన ప్రదేశంలో వంటా వార్పు, వెలగపూడి, మందడం, రాయపూడి గ్రామాల్లో నిరసనలు కొనసాగించనున్నారు. తుళ్లూరు, పెద్దపరిమి గ్రామాల్లో మహాధర్నా చేపట్టనున్నారు. ఏపీ ప్రభుత్వం రాజధాని తరలింపును ఉపసంహరించుకునే వరకూ... ఆందోళనను కొనసాగిస్తామని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి స్పష్టం చేసింది. అన్నదాతల ఆందోళనలకు వీఐటీ విద్యార్థులు మద్దతు తెలిపారు. నేడు మందడంలో జరగనున్న ధర్నాలో పాల్గొనున్నారు.
ఇవీచూడండి: 'చంద్రబాబుపై కసితోనే అమరావతికి మంగళం'