Paddy Procurement Problems : ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6811 కొనుగోలు కేంద్రాలు తెరిచి 74 లక్షల టన్నుల ధాన్యం కొనాలని 20 రోజుల కిందటే ప్రభుత్వం ఆదేశించింది. గత ఏడాది ఇదే సమయానికి 10 లక్షల టన్నులకు పైగా ధాన్యం సేకరించగా, ఈ నెల 3వ తేదీ నాటికి కేవలం 3525 కేంద్రాలు తెరిచి 4.20 లక్షల టన్నులే కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులుగా ఉరుములు, మెరుపులతో అకాలవర్షాలు పడతాయని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ రోజూ హెచ్చరిస్తున్నా కొనుగోలు ప్రక్రియ వేగం పుంజుకోలేదు. మొత్తం 10 జిల్లాల్లో ఒక్క గింజ కూడా కొనలేదు. ఇప్పటివరకు 3535 కేంద్రాలు తెరిచినట్లు లెక్కలు చూపుతున్నా వివిధ సమస్యల వల్ల చాలాచోట్ల కొనుగోలు ప్రారంభించలేదు. ఉదాహరణకు మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో మొత్తం ఎనిమిది కేంద్రాలు ప్రారంభించారు. వీటిలో గుండ్లపల్లి, చెన్నారంలలో మాత్రమే పరిమితంగా ధాన్యం కొంటున్నారు. శివ్వంపేట, గోమారం, చిన్నగొట్టిముక్కల, పెద్దగొట్టిముక్కల, అల్లీపూర్, రత్నాపూర్ కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించలేదు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, పరదాలు రైతులకు సమకూర్చాలి. కానీ వాటి కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ప్రారంభించడంతో అవి చాలక.. ధాన్యం తడిసిపోతోంది.
జాప్యానికి కారణాలు... గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారికి పౌరసరఫరాల సంస్థ రసీదు పుస్తకాలు (డ్రగ్‌షీట్లు) పంపలేదు.
కొనుగోలు కేంద్రాల సమీపంలోని రైసుమిల్లులను కేటాయించాలి. కేంద్రాలవారు ఆ మిల్లులతో ఒప్పందాలు చేసుకోవాలి. ఈ ప్రక్రియలేవీ పూర్తికాలేదు.
తూకం, తేమ కొలత, ధాన్యం శుభ్రపరచడానికి వాడే యంత్రాల కొరత ఉంది. అవి వస్తే గానీ కొనుగోళ్లు సాధ్యం కావు.
ఇవీ చదవండి : మామిడి ప్రియులకు గుడ్న్యూస్... ఇచ్చట 450కి పైగా రకాల పండ్లున్నాయ్!