కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మాడుగుల, నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రాథమిక విద్య చదివారు. ఓయూలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, జర్నలిజం చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. రెండుసార్లు ఓయూ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నెహ్రూ రాజకీయ విధానాలపై ఆకర్షితులై... కాంగ్రెస్‌తో అనుబంధం పెంచుకున్నారు. విద్యార్థి దశ నుంచే ప్రపంచ రాజకీయ పోకడలపై స్పష్టమైన అవగాహన ఉండేది. అద్భుత భాషా పటిమ, అనర్గళమైన వాగ్ధాటి జైపాల్‌రెడ్డి సొంతం. పార్లమెంటులో ప్రతి అంశంపై విస్పష్టమైన అవగాహనతో మాట్లాడే నేతల్లో జైపాల్‌రెడ్డి ఒకరు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. దక్షిణాది నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా జైపాల్‌రెడ్డికి పార్టీలో మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
రాజకీయ ప్రస్థానం...
- విద్యార్థి సంఘ నాయకుడిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జైపాల్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. రెండుసార్లు విశ్వవిద్యాలయ ఎన్నికల్లో విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికయ్యారు.
- 1965-71 మధ్య జాతీయ స్థాయిలో యూత్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు అనేక మంది జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి.
- అనంతరం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాలుగేళ్లు పనిచేశారు.
- 1969లో తొలిసారి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన వరుసగా నాలుగుసార్లు అదే స్థానం నుంచి గెలుపొందారు.
- ఎమర్జెన్సిని వ్యతిరేకిస్తూ 1977లో కాంగ్రెస్‌ను వీడారు. 1979లో జనతాపార్టీలో చేరారు. 1985 నుంచి 88 వరకు జనతాపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
- 1980లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
- 1984లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1998లో మరోసారి గెలిచారు.
- 1999లో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు.
- 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు.
- 2009లో చేవెళ్ల ఎంపీగా ఎన్నికయ్యారు.
- 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
- జూన్ 1991 నుంచి 1992 వరకు కాంగ్రెస్ రాజ్యసభా పక్షనేతగా వ్యవహరించారు
- 1999 నుంచి 2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు.
కీలక పదవులు, విజయాలు
- ఐకే గుజ్రాల్ కేబినెట్‌లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
- మన్మోహన్‌సింగ్ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా దిల్లీ మాస్టర్ ప్లాన్‌లో కీలక పాత్ర పోషించినట్లుగా ఆయనకు గుర్తింపు ఉంది.
- పలుసార్లు పార్లమెంటు స్థాయి సంఘాలు, సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా వ్యవహరించారు.
- ప్రసారభారతి బిల్లును ప్రవేశపెట్టడం, అములులో జైపాల్ రెడ్డిదే కీలక పాత్ర.
- ఎఫ్‌ఎం రేడియో ఛానెళ్లను విస్తృతీకరణకు ఎనలేని కృషి చేశారు.
- ఉభయసభల ప్రత్యక్షప్రసారాల విధానాన్ని సూత్రీకరించి, దాన్ని అమలులోకి తెచ్చిన ఘనత జైపాల్ రెడ్డిదే.
- దిల్లీ మాస్టర్ ప్లాన్‌ని అమలు చేసి అందులో భాగంగా దేశ రాజధాని ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారంగా నిలిచిన మెట్రో సర్వీస్ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
- 2010 కామన్వెల్త్ పోటీల మౌలిక వసతుల ఏర్పాటు బాధ్యతలు జైపాల్ రెడ్డికే అప్పగించారు.
- 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి ఘనత సాధించారు.
ఇదీ చూడండి: జైపాల్‌రెడ్డి: దక్షిణాది తొలి ఉత్తమ పార్లమెంటేరియన్