రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. గత రెండు మూడేళ్లుగా యాంత్రీకరణ పథకం పట్ల కాస్త ఉదాసీనంగా ఉన్న ప్రభుత్వం... మళ్లీ అమలు చేసేందుకు సిద్ధమైంది. కొవిడ్-19 నేపథ్యంలో వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లడం, ఇతర పొరుగు జిల్లాలు, గ్రామాల నుంచి వచ్చినా స్థానిక కూలీలు అడ్డుకోవడం, స్థానిక కూలీలు సైతం భయంతో పనులకు వెళ్లకపోవడం వంటి పరిణామాలతో యాంత్రీకరణ వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది.
రైతుల కొరతతో ఇబ్బందులు...
ఈ ఏడాది వానా కాలం సీజన్‌లో వరి నాట్లు, పత్తి విత్తనాలు చల్లడం, ఇతర కూలీలకు కూలీల కొరత తీవ్రంగా వేధించింది. సకాలంలో భూములు చదును చేసుకోలేక, పంట విత్తనాలు విత్తుకోలేక, నాట్లు, కలుపు తీత వంటి పనులు నానా ఇబ్బందులు పడాల్సింది. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ తదితర ఉమ్మడి జిల్లాల్లో వరి నాట్లుసహా పత్తిలో కలుపు తీయడానికి రైతులు ఒక్కో కూలీకి రూ.1000 ఇచ్చినా దొరకని పరిణామాలు అనుభవించాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో రైతులకు అవరసమైన వ్యవసాయ యంత్రాలు రాయితీపై ఇచ్చేందుకు సింసిద్ధమైంది. తాజాగా సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ - ఎస్‌ఎంఏఎం పథకం అమలు చేసే క్రమంలో... రాష్ట్ర స్థాయి కార్యనిర్వాహణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కమిటీ ఛైర్మన్‌గా వ్యవసాయ శాఖ కార్యదర్శి వ్యవహరించనున్నారు. సభ్య కార్యదర్శులుగా వ్యవసాయ శాఖ సంచాలకులు, నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్, కో-సభ్య కార్యదర్శిగా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ సంచాలకులు వ్యవహరించనున్నారు. నిపుణుల విభాగం సభ్యులుగా భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్త, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ నియమితులైనట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
జిల్లా స్థాయి కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్ జిల్లా కలెక్టర్, సభ్య కార్యదర్శిగా వ్యవసాయ ఇంజినీరింగ్ విభాగం ఉప సంచాలకులు, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్, సహా సభ్య కార్యదర్శిగా జిల్లా వ్యవసాయ అధికారి, నిపుణుల విభాగం నుంచి ఒక శాస్త్రవేత్త, అభ్యుదయ రైతు, బ్యాంకు అధికారి, ఆత్మా అధికారిగా నియమితులయ్యారు.