నకిలీ వీసాలతో మహిళలను గల్ఫ్ దేశాలకు తరలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. తణుకు కు చెందిన కుబేందర్‌రావు ప్రస్తుతం రాజేంద్రనగర్‌లోని కాటేదాన్‌లో నివసిస్తూ... ముఠాకు నేతృత్వం వహిస్తున్నాడు. షేక్ బషీర్‌అహ్మద్, బాలు ప్రసాద్ తదితరులతో కలిసి నకిలీ వీసాల మోసాలకు తెరతీశాడు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు మహిళలను దుబాయికి నకిలీ వీసాలతో కొంత కాలంగా పంపిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందుకు గాను ఒక్కొక్కరి వద్ద నుంచి లక్ష రూపాయల వరకు ముఠా వసూలు చేసేదని సజ్జనార్ చెప్పారు. ఇప్పటి వరకు నిందితులు 21 మందిని ఈ విధంగా గల్ఫ్ దేశాలకు పంపినట్లు వివరించారు. నిందితుల వద్ద నుంచి రెండు లక్షల రూపాయలతో పాటు 16 పాస్‌పోర్టులు, 13 వీసాలు, లాప్‌టాప్, 25 రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి:గాంధీ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ అరెస్ట్