రాష్ట్రంలో కరోనా కారణంగా లాక్ డౌన్ విధిస్తున్నారంటూ నకిలీ జీఓను రూపొందించిన వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ల్యాప్ టాప్, చరవాణి స్వాధీనం చేసుకున్నారు. నెల్లూర్కు చెందిన శ్రీపతి సంజీవ్ మాదాపూర్లో నివాసం ఉంటున్నాడు. సీఏ పూర్తి చేసిన సంజీవ్ ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాడు.
గతేడాది లాక్ డౌన్ కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీఓను అంతర్జాలం నుంచి డౌన్లోడ్ చేసుకున్న సంజీవ్... అందులో తేదీలు మార్చాడు. తన స్నేహితులతో కూడిన వాట్సాప్ గ్రూప్లో ఈ నెల 1న పోస్ట్ చేశాడు. దాన్ని నిజమని నమ్మిన అతని స్నేహితులు... ఇతర వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేశారు. దీంతో నకిలీ జీఓ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింగిది.
ఆ జీఓ నకిలీదని.. ఎలాంటి లాక్ డౌన్ విధించడంలేదని సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటించాల్సి వచ్చింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు... సాంకేతికతను ఉపయోగించుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులంటూ నకిలీలు సృష్టించడం తీవ్రమైన నేరమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. జీవోల పేరుతో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
- ఇదీ చదవండి : రాష్ట్రంలో 8 వేలు దాటిన కరోనా క్రియాశీల కేసులు