రాష్ట్రంలో కొత్త ఏడాది వేడుకల్లో మాదకద్రవ్యాల సరఫరాను నిలువరించేందుకు ఆబ్కారీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందుకోసం 57 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇవాళ సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు ఈ ప్రత్యేక బృందాలు పని చేస్తాయి. ప్రధానంగా బార్లు, పబ్‌లు, రెస్ట్రారెంట్లు, నూతన సంవత్సర వేడుకల నిర్వహణ స్థావరాలపై ఈ బృందాలు నిఘా ఉంచుతాయి. అనుమానం ఉన్న ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి.
పటిష్ఠ నిఘా
కొత్త సంవత్సరం వేడుకల్లో మాదకద్రవ్యాల సరఫరా ముఠాలు రెచ్చిపోయే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ ముందస్తు అంచనా వేసింది. పెద్ద ఎత్తున మత్తుమందులు సరఫరా జరిగే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్న ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలకు పూనుకుంది. నిఘాను పటిష్ఠం చేయడంతోపాటు ఆకస్మిక సోదాలు నిర్వహించడం ద్వారా మాదకద్రవ్యాల సరఫరాకు అడ్డుకట్ట వేయాలని యోచిస్తోంది.
57 ప్రత్యేక బృందాలు
ఇందుకోసం... ఏర్పాటైన 57 ప్రత్యేక బృందాల్లో ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం నుంచి ఏడు, జిల్లా టాస్క్‌ఫోర్స్ విభాగం నుంచి ఆరు, ఎక్సైజ్ స్టేషన్ల నుంచి మరో 44 బృందాలు ఉన్నట్లు ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అయిదుగురు సభ్యులతో కూడిన... ప్రతి బృందంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌కాని, సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కాని నేతృత్వం వహిస్తారని వివరించారు.
ఇదీ చదవండి : గెట్అవుట్ 2020... హమ్మయ్య ఇవాళ్టితో వెళ్లిపోతోంది!