హైదరాబాద్‌లో 'తెలంగాణ తేజం మన పీవీ' పేరుతో సంస్మరణ సభను నిర్వహించారు. సాహితీ సౌరభం- అసమాన దార్శనికత ఉపశీర్షిక పేరున జరిగిన సమాలోచన సభకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ ఛైర్మన్, ఎంపీ కేశవరావు, పీవీ కుమార్తె వాణీ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. దేశానికి, రాష్ట్రానికి పీవీ అందించిన సేవలు, సంస్కరణలపై చర్చించారు.
పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలని కల్వకుంట్ల కవిత అన్నారు. పీవీ కోసం యువతకు తెలియాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయపడ్డారు. దీని బాధ్యత జాగృతి జిల్లా శాఖలు తీసుకోవాలని సూచించారు. యువతను పుస్తకాల వైపు మళ్లించాలని సూచించారు. ఇప్పుడంతా లుక్ కల్చర్ ఉందని.. దానికి బుక్ కల్చర్‌గా మార్చాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ జాగృతి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని కవిత వెల్లడించారు. పీవీ మేధస్సుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అక్షర నివాళి ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతినెలా రెండు సార్లు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. జాగృతి ఆధ్వర్యంలో పీవీ బుక్ క్లబ్ నిర్వహిస్తామని ప్రకటించారు.
జ్ఞానభూమిలో పీవీ మెమోరియల్ నిర్మిస్తామని ఎంపీ, పీవీ శతజయంతి ఉత్సవాల ఛైర్మన్ కేశవరావు ప్రకటించారు. పీవీ వ్యక్తిత్వం, విజయాలు తెలిసేలా మెమోరియల్ నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. ఆయా డిజైన్లకు సీఎం ఆమోదం తెలిపాక నిర్మాణం చేపడతామన్నారు. వచ్చే ఏడాది జూన్ 28 నాటికి ప్రధాని మోదీ చేతులమీదుగా మెమోరియల్ ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో పీవీ ఫొటో పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిపారు. పీవీ పేరు మీద స్టాంప్ విడుదల చేస్తామన్నారు.
ఇవీచూడండి: సర్కారీ బడుల్లో 'ఆన్లైన్ విద్య' ఎలా?