హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతమున్న సౌకర్యాలకు గట్టి పునాది కాంగ్రెస్ హయాంలో జరిగిందని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. తెరాస ఆరున్నరేళ్ల కాలంలో హైదరాబాద్ నగరానికి ఏమీ చేయకుండా మాటలకే పరిమితం చేశారని దుయ్యబట్టారు. గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్.. ప్రజా మేనిఫెస్టోను రూపొందిస్తోందని వెల్లడించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. అందుకోసం 8639721075 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని లేదా speakuphyderabad@gmail.Comకు మెయిల్ చేయవచ్చునని అయన సూచించారు.
వారం పది రోజులపాటు వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో కమిటి సమావేశం జరిగిందని.. ఈ భేటీకి దిల్లీ నుంచి జూమ్ యాప్ ద్వారా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చారని మర్రి శశిధర్ రెడ్డి వివరించారు. వరద బాధితులకు ఇచ్చే పరిహారం పూర్తిగా అవినీతిమయం అయిందని.. నిజమైన బాధితులకు కాకుండా తెరాస కార్యకర్తల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు.
ఇదీ చూడండి: 101 కిలోల వెండితో పార్టీ అధ్యక్షుడికి తులాభారం