హైదరాబాద్లోని తన తండ్రి ఆస్తుల కోసం పోరాటం చేస్తున్న తమపై తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారని.. ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా.. ఐడెంటిఫికేషన్ కోసం కోర్టుకు రాకుండా తప్పుడు కొవిడ్ రిపోర్టు పెట్టారన్న ఆరోపణలతో.. తన భర్త, తమ్ముడిపై కేసులు పెట్టారని అన్నారు.
గత ఆరు నెలల్లో రెండు సార్లు భార్గవరామ్ నాయుడు కోర్టుకు వెళ్లినట్లు ఆమె తెలిపారు. కొంతమంది వ్యక్తులు పోలీసులను అడ్డుపెట్టుకుని కావాలనే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసు అధికారులు తమను ఏ విధంగా వేధిస్తున్నారో.. ఆధారాలతో సహా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు లేఖలు రాస్తానన్నారు. ప్రాణాలు పోయినా ఫర్వాలేదని.. తమ ఆస్తుల కోసం పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
చావడానికైనా సిద్ధపడతాం...
'కేవలం ఇది డబ్బు కోసమో, ఆస్తుల కోసమో కాదు.. భూమా నాగిరెడ్డి పిల్లలుగా మా హక్కుల కోసం కొట్లాడుతున్నాం. లీగల్గా ఎంత వరకైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఆఖరికి చావడానికైనా సిద్ధపడతాం కానీ... భూమా నాగిరెడ్డి ఆస్తులు వారి పిల్లలకు వచ్చేవరకు కొట్లాడుతాం... అది ఆళ్లగడ్డలోనైనా లేక హైదరాబాద్లోనైనా..
-భూమా అఖిలప్రియ, ఏపీ మాజీ మంత్రి
ఇదీ చదవండి: తండ్రి కలలు సాకారం చేసేందుకే రాజకీయాల్లోకి షర్మిల: విజయమ్మ