నూటికి నూరుపాళ్లు ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యం వల్లే మల్లాపూర్‌కు చెందిన గర్భిణి మృతి చెందినట్లు జిల్లా వైద్యాధికారుల విచారణలో వెల్లడైంది. ఆయాసంతో వెళ్లిన పావనిని ఐదు ఆస్పత్రుల్లోని వైద్యులెవరూ కనీసం నాడిపట్టి కూడా చూడలేదని స్పష్టం చేశారు. ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్న పావనికి ఆయాసం రావడం వల్ల తల్లిదండ్రులు నాచారంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు కరోనా సోకిందనే అనుమానంతో చికిత్సకు నిరాకరించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఎల్బీనగర్, లక్డీకపూల్‌లోని ఐదు ఆస్పత్రులకు వెళ్లారు. ఈ క్రమంలో అంబులెన్స్‌లోనే పావని మరణించింది.
ఈ ఘటనపై మేడ్చల్ జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ శ్వేతా మహంతి విచారణకు ఆదేశించారు. జిల్లా వైద్యాధికారులతో పాటు రెవెన్యూ అధికారులతో వేరువేరుగా విచారణ జరిపించారు. జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు పావని తల్లిదండ్రులతో పాటు వాళ్లు తిరిగిన ప్రైవేటు ఆస్పత్రుల వద్ద ఆరా తీశారు. సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. ఈ విచారణలో ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యం కారణంగానే పావని మృతి చెందినట్లు వైద్య బృందం కలెక్టర్‌కు నివేదించింది. రెవెన్యూ అధికారుల దర్యాప్తులోనూ ఇదే విషయం స్పష్టమైనట్లుగా తెలుస్తోంది.