దేశంలో 46.8 శాతం మంది ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో ఉద్యోగ అవకాశాలకు తగిన నైపుణ్య అర్హతలు ఉన్నాయని ఇండియా నైపుణ్య నివేదిక వెల్లడించింది.ఎంబీఏ పూర్తిచేసిన వారు 46.59 శాతంతో తర్వాతి స్థానంలో ఉన్నారని పేర్కొంది. ఈ రెండు కోర్సుల వారికే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపింది. గత ఏడాదితో పోల్చితే బ్యాంకులు, ఆర్థిక సేవా సంస్థలు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఐటీ, ఇంటర్‌నెట్ వ్యాపార కేటగిరీల్లో ఈ ఏడాది కొత్త నియామకాలు పెరగనున్నాయని తెలిపింది. ఐటీ సంస్థలు ఎక్కువ మంది మహిళలకు అవకాశాలు ఇస్తున్నాయని పేర్కొంది.
క్లౌడ్ కంప్యూటింగ్, డేటాసైన్స్, నేచురల్ లాంగ్వేజి ప్రాసెసింగ్ రంగాలకు అధిక డిమాండ్ ఉన్నప్పటికీ, ఈ రంగాల్లో నైపుణ్య కొరత ఎక్కువగా ఉందని వివరించింది. రానున్న ఐదేళ్లలో డేటా సైంటిస్ట్, అనలిస్టు, ఏఐ స్పెషలిస్టుల డిమాండ్ కొరతను తీర్చేందుకు ఐటీ సంస్థలు అవసరమైన నిపుణులను అన్వేషించాల్సి ఉందని స్పష్టం చేసింది.
కరోనా తరువాత ఉద్యోగ అవకాశాలు, నిపుణులైన మానవ వనరులపై వీబాక్స్, ట్యాగ్డ్, సీఐఐ, ఏఐసీటీఈ, యూఎన్‌డీపీ, భారతీయ యూనివర్సిటీల సమాఖ్య సంయుక్తంగా దేశవ్యాప్తంగా 65 వేల మంది అభ్యర్థులు, 15 రంగాలకు చెందిన చెందిన 150 కార్పొరేట్ సంస్థలతో నిర్వహించిన ‘ఇండియా స్కిల్స్ నివేదిక-2021’ విడుదలైంది. రానున్న రోజుల్లో కార్పొరేట్ సంస్థలు ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, సరైన అనుభవం లేకపోవడంతో ఉద్యోగార్థులకు అవకాశాలు రావడం లేదని గుర్తించింది. దీంతో దేశయువత పారిశ్రామిక, కార్పొరేట్‌సంస్థల్లో ఇంటర్న్‌షిప్ కోసం ఎదురుచూస్తున్నారంది.
నివేదికలో ఏముందంటే..
- దేశంలో శ్రామిక శక్తి కలిగిన మహిళలు 36 శాతానికి పరిమితమయ్యారు. రాజస్థాన్‌లో 46.18 శాతం మహిళలు ఉంటే... రెండోస్థానంలో తెలంగాణ మహిళలు 32.71 శాతంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.
- ఐదేళ్లతో పోల్చితే మహిళా కార్మిక బలగం గణనీయంగా పెరిగింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మహిళలకు ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి.
- సంఘటిత రంగాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇంటర్‌నెట్ వ్యాపారంలో 39 శాతం, ఐటీ రంగంలో 38 శాతం మంది మహిళలకు అవకాశాలు దక్కాయి.
- పురుషుల కన్నా మహిళలు ఉద్యోగ సామర్థ్యాలు అధికంగా కలిగి ఉన్నారు. మూడేళ్లుగా ఉపాధి అర్హత కలిగిన మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సరైన నైపుణ్యాలు సాధిస్తే రానున్న రోజుల్లో పరిశ్రమలకు అతిపెద్ద టాలెంట్ పూల్‌గా మహిళలు ఉంటారు.
- దేశంలోని యువతలో ఉద్యోగాల సామర్థ్యం 45.9 శాతానికి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో విద్యలో మార్పులు తీసుకువచ్చి, మార్కెట్ డిమాండ్ మేరకు నైపుణ్య శిక్షణ పెంచాలి. ఆటోమోటివ్ సెక్టార్‌లో పురుషులు ఎక్కువ. ఈ రంగంలో 79 శాతం మంది, లాజిస్టిక్స్‌లో 75 శాతం, ఇంధన-కోర్ రంగాల్లో 72 శాతం మంది పురుష ఉద్యోగులు ఉన్నారు.
రాష్ట్రంలో పరిస్థితి ఇదీ..
పురుషుల్లో ఉద్యోగ నైపుణ్యాల ఆధారంగా తెలంగాణ ఐదోస్థానంలోఉంది. నగరాల పరం గా హైదరాబాద్ తొలిస్థానం దక్కించుకుంది. మహిళా ఉద్యోగాల వారీగా తెలంగాణ రెండోస్థానంలో, నగరాల వారీగా హైదరాబాద్ తొలిస్థానంలో ఉంది. ఇంటర్న్‌షిప్‌లో 91.33 శాతం స్కోరుతో తెలంగాణ రెండోస్థానంలో ఉంది.
- ఇదీ చూడండి : విద్యారంగంలో ట్రెండింగ్ టెక్నాలజీలు