బల్దియా బరిలో దిగే అభ్యర్థులు పోటీకి అర్హులా కాదా తెలుసుకునేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ ఓ ప్రకటన విడుదల చేసింది.
దత్తత ఇస్తే..
* జులై 19, 2006న 17947/2005 రిట్ పిటిషన్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు ప్రకారం పిల్లలను దత్తత ఇచ్చినప్పటికీ జన్మనిచ్చిన వారి పిల్లలగానే పరిగణించాల్సి ఉంటుంది.
* ఒక వ్యక్తి మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు కలిగి, భార్య చనిపోయిన తర్వాత రెండో భార్య ద్వారా మరో బిడ్డకు జన్మనిస్తే ఆయన పోటీకి అనర్హులు.
* ఒక వ్యక్తి ఉన్న ముగ్గురు పిల్లల్లో ఒకరు నామినేషన్ పరిశీలనకు ముందు చనిపోతే.. నామినేషన్ పరిశీలన రోజు జీవించి ఉన్న పిల్లలను లెక్కలోకి తీసుకుని వారి అర్హతను నిర్ణయిస్తారు.
* నామినేషన్ పరిశీలన రోజుకి ఇద్దరు పిల్లలు కలిగి, ఆమె గర్భవతి అయి ఉన్నట్లయితే.. ఆ రోజుకు ఇద్దరు పిల్లలే ఉన్నందున సమయానికి ఆమె పోటీకి అర్హురాలు.
* రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాలలో లేదా స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగి ఎన్నికల్లో పోటీ చేయొచ్చా అంటే.. నామినేషన్ పరిశీలన రోజుకి అతని రాజీనామా ఆమోదం పొందినట్లయితే ఆ ఉద్యోగి పోటీకి అర్హత సాధిస్తారు.
* రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం 2006లో ఇచ్చిన తీర్పు ప్రకారం రేషన్ దుకాణం డీలరు పోటీ చేయొచ్చు.
* అంగన్‌వాడీ వర్కర్లు పోటీకి అనర్హులు.
* జీహెచ్‌ఎంసీకి ఏదేనీ రూపంలో బకాయి పడిన వ్యక్తి.. నామినేషన్ పరిశీలన సమయానికి వాటిని తీర్చకపోతే పోటీకి అనర్హులు.
* ఏదేనీ డివిజన్‌కు పోటీ చేసే వ్యక్తి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏదో ఓ డివిజన్‌లో ఓటరై ఉండాలి.
* పోటీ చేస్తున్న అభ్యర్థిని బలపరిచే వ్యక్తి కూడా సంబంధిత డివిజన్ ఓటరై ఉండాలి.
* ఒక వ్యక్తి ఒక పదవికి గరిష్ఠంగా 4 నామినేషన్లు సమర్పించవచ్చు.
ప్రమాణపత్రంలో తప్పులుంటే..
నామినేషన్ దాఖలు చేసిన రోజున అభ్యర్థులు సమర్పించిన నామపత్రం, ప్రమాణపత్రాలను రిటర్నింగ్ అధికారి నోటీసుబోర్డులో ఉంచుతారు. వాటిలో తెలిపిన వివరాలు తప్పని చెబుతూ ఎవరైనా ప్రమాణపత్రం ఇస్తే.. వాటిని కూడా సదరు రిటర్నింగ్ అధికారి నోటీసు బోర్డుపై అతికించాలి. ఆ సమయంలో ఎన్నికల అధికారికి పోటీ చేస్తున్న అభ్యర్థి తప్పుడు సమాచారం ఇచ్చారని నిర్ణయించుకున్నట్లయితే ఐపీసీ సెక్షన్-177, సీపీసీ 200 ప్రకారం సంబంధిత న్యాయస్థానంలో చేయవచ్ఛు అంతేగాని ఆయన/ఆమె నామినేషన్‌ను తిరస్కరించడానికి వీలుండదు.
మతిస్థిమితం లేని వ్యక్తి నామినేషన్ వేస్తే..
పోటీ చేసేందుకు మతిస్థిమితం లేని వ్యక్తి నామినేషన్ వేసినట్లు ఎవరైనా ఫిర్యాదు చేసి, ల్యునసీ చట్టం-1912 ప్రకారం నిరూపించినట్లయితే పోటీ చేసే వ్యక్తిని ఎన్నికల అధికారి అనర్హులుగా ప్రకటిస్తారు.
నామినేషన్ దాఖలు సమయం.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు
ఎక్కడ.. సంబంధిత వార్డు రిటర్నింగ్ అధికారి కార్యాలయం
అర్హతలు..
ప్రమాణపత్రంలో పోటీ చేసే అభ్యర్థి కేవలం నామపత్రం సమర్పించి మిగిలిన ధ్రువపత్రాలను గడువు ముగిసే సమయం వరకూ సమర్పించకపోతే.. ఎన్నికల అధికారి చెక్‌లిస్టు కాలమ్‌లో సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించలేదని రాసి, నామినేషన్ తిరస్కరణపై పరిశీలన సమయంలో నిర్ణయం తీసుకుంటారు.
నకిలీ సంతకమైతే..
పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలపై బలపరిచే వ్యక్తుల పేరుతో నకిలీ సంతకాలు చేయిస్తే.. ఎన్నికల అధికారి ఆ విషయాన్ని పరిశీలించి, సంతకం నకిలీదని తేలితే నామపత్రాన్ని తిరస్కరిస్తారు. సదరు వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. అయితే, విచారణలో పోటీ చేసే వ్యక్తికి సరైన సమయం ఇవ్వాలి. అవసరమైతే నామినేషన్ పరిశీలనను రిటర్నింగ్ అధికారి వాయిదా వేయొచ్చు.