గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో సమావేశమైంది. గుర్తింపు పొందిన 11 పార్టీల ప్రతినిధులతో కమిషనర్ పార్థసారధి విడివిడిగా సమావేశమయ్యారు. వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఖరారు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అభ్యర్థుల వ్యయం, తదితర అంశాలపై చర్చించారు. ఆయా అంశాలపై పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని కమిషనర్ చెప్పారు.
ఎన్నికల సంఘం తీసుకునే చర్యలు బాగున్నాయని తెరాస ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అభ్యర్థుల ఖర్చులు పెంచాలని తామే కోరినట్టు తెలిపారు. దివ్యాంగులకు కొవిడ్ రోగులకు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరారు. సోషల్ మీడియా కట్టడి కోసం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని తెరాస ప్రధాన కార్యదర్శి భరత్ పేర్కొన్నారు. కార్పొరేషన్లో ఉన్న అధికారులు నాయకులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని భాజపా నేత చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. దుబ్బాకలో పనిచేసిన పోలీసులు కాకుండా కేంద్ర బలగాలు ఇతర రాష్ట్రాల పోలీసులను తీసుకురావాలన్నారు.
బీసీల రిజర్వేషన్లు పెంచాలని భాజపా నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో 25శాతం పోలింగ్ కేంద్రాలు అదనంగా పెంచాలని కాంగ్రెస్ నేత మర్రి శిశిధర్ రెడ్డి సూచించారు. తూతూ మంత్రంగా ఎన్నికలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించకుండా రిజర్వేషన్లు ఉండాలన్నారు. గతంలో జరిగిన లోటుపాట్లు సరిచేయాలని, అభ్యర్థుల పేర్లు హిందీలో కూడా ప్రచురించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ సూచించారు. పోలింగ్‌కు ఐదు రోజుల ముందు మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఓటర్ల జాబితా ముసాయిదా రాజకీయ పార్టీలకు ఎందుకు పంపలేదని టీటీడీపీ నేత జ్యోత్స్న ప్రశ్నించారు. ఒక డివిజన్ ఓట్లను మరో డివిజన్లో కలుపుతున్నారని ఆక్షేపించారు. చాలా ఓట్లు గల్లంతైయ్యాయని, మళ్లీ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని వైసీపీ నేత ప్రపూల్ రెడ్డి కోరారు.
ఇదీ చూడండి: ఆత్మనిర్భర్ భారత్ 3.0: ఉపాధి కల్పనకు పెద్ద పీట