పాఠశాలలు, కళాశాలలు ఎప్పటి నుంచి ఎలా ప్రారంభించాలనే అంశంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, విద్యా సంస్థల నిర్వహణలో అనుభవమున్న ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆన్లైన్ పాఠ్యాంశాల బోధన.. పూర్తి ప్రత్యామ్నాయం కాదని భేటీకి హాజరైన ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. తరగతులు ప్రారంభించిన తర్వాత కొంత సిలబస్ పూర్తి చేయడానికి ఆన్లైన్ క్లాసులు కూడా వాడుకోవచ్చునని వివరించారు. అవసరమైతే స్థానిక కేబుల్ టీవీల ద్వారా పాఠాలు బోధించాలని సూచించారు.
యూజీసీ మార్గదర్శకాల ప్రకారం..
పాఠశాలల్లో జులై నుంచి దశలవారీగా తరగతులు ప్రారంభించడం మంచిదని సూచించారు. పదో తరగతి పరీక్షలే పూర్తి కాలేదు కాబట్టి.. ఇంటర్ తరగతులు ఆగస్టు తర్వాతే మొదలు పెడితే మంచిదని పేర్కొన్నారు. డిగ్రీ, పీజీ తరగతులు యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్తాలని సూచించారు. అయితే పాఠశాలలు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
పదిహేను రోజుల తర్వాత..
లాక్డౌన్ అనంతరం కరోనా ప్రభావం తగ్గుతుందో? పెరుగుతుందో? తెలియదు కాబట్టి.. పదిహేను రోజుల తర్వాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. సమావేశానికి మంత్రి మల్లారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, జనార్దన్ రెడ్డి, రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, పాఠశాల, ఇంటర్, సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: క్లినికల్ ట్రయల్స్‌కు 'సన్‌ఫార్మా'కు అనుమతి